‘ఇస్మార్ట్‌..’ రామ్‌

హుషారుకి మారు పేరు రామ్‌. ఎనర్జిటిక్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడాయన. తెరపైన ఎంత వేగంగా సందడి చేస్తుంటారో... తెర వెనక కూడా ఆయన అంతే హుషారుగా కనిపిస్తుంటారు. పరిశ్రమ నిండా యువ కథానాయకుల జోరు కనిపిస్తున్న సమయంలో తెరంగేట్రం చేశారు రామ్‌. అంత పోటీలోనూ, తనదైన ప్రత్యేకతని ప్రదర్శించి గుర్తింపు సొంతం చేసుకొన్నారు. రామ్‌ తన నటనతో తెలుగు పరిశ్రమపై తనదైన ముద్ర వేశాడు. బలమైన మార్కెట్‌ ఉన్న యువ కథానాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ నిర్మాత, స్రవంతి మూవీస్‌ అధినేత స్రవంతి రవికిషోర్‌ తమ్ముడు మురళి పోతినేని తనయుడైన రామ్‌ హైదరాబాద్‌లో 1987 మే 15న జన్మించారు. తమిళనాడులోని చెన్నైలోని చెట్టినాడ్‌ విద్యాశ్రమం, సెంట్‌ జాన్‌ పాఠశాలలో ఆయన విద్యాభ్యాసం సాగింది. పాఠశాల వయసులోనే ఆయనకి సినిమా పరిశ్రమ నుంచి అవకాశాలు అందాయి. ఎన్‌.జె.భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకొన్న రామ్‌... వై.వి.యస్‌.చౌదరి దర్శకత్వం వహించిన ‘దేవదాస్‌’ చిత్రంతో తెరకు పరిచయమయ్యారు. 2006 జనవరి 11న విడుదలైన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకొంది. తొలి సినిమాతోనే రామ్‌ గురించి పరిశ్రమ వర్గాలు, ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకొన్నారు. ఆ తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో ‘జగడం’ చేశారు. ఈ చిత్రం పెద్దగా విజయవంతం కాలేదు కానీ... రామ్‌కి మంచి ప్రశంసలే లభించాయి. ఆ తర్వాత అగ్ర దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘రెడీ’ చేశాడు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. రామ్‌ కుటుంబ ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. ఆ తర్వాత చేసిన ‘మస్కా’, ‘గణేష్‌’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’ పర్వాలేదనిపించాయి. ‘కందిరీగ’తో మళ్లీ మునుపటి ఫామ్‌ని అందుకున్న ఆయన ఆ తర్వాత ‘ఎందుకంటే ప్రేమంట’, ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’, ‘పండగ చేస్కో’, ‘శివమ్‌’ చిత్రాలు చేశారు. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘నేను శైలజ’ చేసి మరో విజయాన్ని అందుకోవడంతో పాటు, తన నటనలో స్టైల్‌ని కూడా మార్చేశాడు. ‘హైపర్‌’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురు ప్రేమకోసమే’ తదితర చిత్రాలు చేసిన రామ్, ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చేస్తున్నారు. ఈ చిత్రంతో ఆయన లుక్‌ పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్‌ కుర్రాడిగా రామ్‌ సందడి చేయబోతున్నాడు. బుధవారం రామ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ టీజర్‌ని విడుదల చేయబోతున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.