అందాల రాశి

బాలనటిగా తెరపైకొచ్చిన రాశి... ఆ తరువాత కథానాయికగా హిందీతో పాటు, దక్షిణాది భాషల్లో నటించి ఓ వెలుగు వెలిగారు. తూర్పు గోదావరి జిల్లాలో జన్మించిన ఆమెకి మంత్ర అని మరో పేరు కూడా ఉంది. 1986లో ‘మమతల కోవెల’ అనే చిత్రంలో కథానాయకుడికి కూతురిగా నటించింది. ఆ తరువాత ‘రావుగారిల్లు’, ‘బాలగోపాలుడు’, ‘ఆదిత్య 369’, ‘అంకురం’, ‘పల్నాటి పౌరుషం’ చిత్రాల్లో నటించింది. 1997లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘పెళ్ళిపందిరి’, ‘గోకులంలో సీత’, ‘శుభాకాంక్షలు’ చిత్రాలతో కథానాయికగా తెలుగుతో తన జోరును చూపించింది రాశి. ‘స్నేహితులు’, ‘పండగ’, ‘దేవుళ్లు’, ‘గిల్లికజ్జాలు’ తదితర చిత్రాలతో నటిగా తన ప్రతిభని ప్రదర్శించారు. హిందీలో మిథున్‌ చక్రవర్తితో కలిసి ‘రంగ్బాజ్‌’, ‘సూరజ్‌’, ‘జోడిదార్‌’ చిత్రాలు చేశారు. తమిళంలో విజయ్, అజిత్‌ తదితర అగ్ర కథానాయకులతో కలిసి ఆడిపాడారు. మలయాళం, కన్నడలోనూ ఆమె చిత్రాలు చేసి గుర్తింపు తెచ్చుకొన్నారు. తెలుగులో పలు విజయాల్ని సొంతం చేసుకొన్న రాశి, ‘సముద్రం’లో ప్రత్యేక గీతం చేసి తన నటనలో మరో కోణాన్ని ఆవిష్కరించారు. ‘నిజం’లో వ్యతిరేక ఛాయలతో కూడిన పాత్ర చేసి మెప్పించారు. ‘కల్యాణ వైభోగమే’, ‘ఆకతాయి’ చిత్రాల్లో తన వయసుకు తగ్గ పాత్రని చేసి క్యారెక్టర్‌ నటిగా తన కెరీర్‌ని తీర్చిదిద్దుకొనే ప్రయత్నం చేశారు. అందాల రాశిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ గుర్తుండే కథానాయిక ఈమె ఎస్‌.ఎస్‌.నివాస్‌ని వివాహమాడారు. ఈ  రోజు రాశి పుట్టినరోజు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.