రోజా...ఉభయ ‘తార’కం
ఇటు వెండితెర...అటు రాజకీయ తెరపై రాణిస్తూ ఇప్పటికీ వార్తల్లో ఉన్న వ్యక్తి రోజా. ఎంచుకున్న రెండు రంగాల్లోనూ అప్పటివరకు ఉన్న హద్దులు చెరిపేసి... తన స్వత్రంత శైలిలో ముందుకు దూసుకుపోయిన ఆమె నైజమే... ఆమెకి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. సినిమాల్లో అందాలు ఆరబోయడంలో ఏమాత్రం వెనుకంజ వేయకపోవడం... రాజకీయాల్లో ప్రత్యర్ధులు ఈ స్థాయి వారయినా తీవ్రభాషలో రెచ్చిపోవడం... రోజా స్టయిల్‌. చిత్రసీమలో తొలినాళ్లలో ఐరన్‌ లెగ్‌ అనిపించుకున్నప్పటికీ... విజయాల్ని అందుకుని ఆ పేరు తుడిపేసుకున్నారు. రాజకీయ రంగంలో కూడా అదే రీతిలో మొదట్లో పేరు పొందినా ఇప్పుడు విజయం సాధించారు. 1972, నవంబర్‌ 17న రోజా జన్మించారు. ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర అంశాలు సితార. నెట్‌ పాఠకుల కోసం.


అసలు పేరు శ్రీలత
రోజా అసలు పేరు శ్రీలత. 1972, నవంబర్‌ 17న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూర్‌ జిల్లాలో నాగరాజరెడ్డి, లలిత దంపతులకు జన్మించారు. రోజాకు కుమారస్వామి రెడ్డి, రామప్రసాద్‌ రెడ్డి అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. కొన్నాళ్ల తరువాత వీరి కుటుంబం హైదరాబాద్‌కు మకాం మార్చింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పొందారు. రోజా కూచిపూడి నాట్యం నేర్చుకొన్నారు. సినిమాల్లోకి రాకముందు ప్రదర్శనలు ఇస్తుండేవారు.
                                                                                                     

రోజాగానే సినిమా పరిశ్రమలో తెలుగుప్రేక్షకులకి బాగా తెలుసు. ‘సీతారత్నంగారి అబ్బాయి’ సినిమాలోని ‘ఇత్తడైపోద్ది’ అన్న డైలాగుతో బాగా పాపులర్‌ చెందారు రోజా. రోజా 1991 నుంచి 2002 వరకు గల సినిమాలలో పలు పేరున్న కథానాయకులతో హీరోయిన్‌గా నటించారు. ఆ తరువాత కాలంలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తనదైనా స్టయిల్‌లో నటించి మరింత పేరు తెచ్చుకుని అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆ ప్రేక్షకాదరణతోనే ఇప్పటికీ టీవీ ఛానెల్లో పలు షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. రోజా 10 సంవత్సరాలు పాటు కథానాయిక పాత్రల్లో మెరిశారు.
                                                                                             
రోజా అనగానే గుర్తు వచ్చే సాంగ్‌  ‘రాజా శేఖరా ఆగలేనురా’ అనే పాట. ఈ పాట ఇప్పటికి ఎంతో వినసొంపుగా ఉంటుంది. అలాగే ‘భైరవద్వీపం’లో ‘విరిసినది వసంత గానం వలపుల పల్లవిగా’. రోజా తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం తదితర భాషలలో నటించి అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించారు. రోజా 3 నంది అవార్డులను కూడా గెలుచుకున్నారు. ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్రం నుంచి అవార్డు అందుకున్నారు.

సినిమా కెరీర్‌
తెలుగు సినిమాతో చిత్రసీమకు పరిచయమయ్యారు రోజా. ‘సర్పయాగం’ సినిమాతో తెలుగుతెరకు ఎంట్రీ ఇచ్చారు రోజా. రాజేంద్ర ప్రసాద్‌తో ‘ప్రేమ తపస్సు’ సినిమా రోజాకు తెలుగులో రెండవ సినిమా. ఈ సినిమా షూటింగ్‌ పూర్తిగా తిరుపతిలో జరిగింది. ఆమె 1991 నుండి 2002 వరకు దక్షిణ భారత సినిమాల్లో ప్రముఖ నటిగా రాణించారు. అలాగే, తమిళ, తెలుగు పరిశ్రమల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా గుర్తింపు పొందారు.

రోజాని తమిళ సినిమా పరిశ్రమకు ఆర్‌.కె.సెల్వమణి పరిచయం చేశారు. సెల్వమణి దర్శకత్వంలో ప్రశాంత్, రోజా హీరోహీరోయిన్లుగా ‘చెంబరుతి’ అనే సినిమాలో నటించారు. రోజాకు తమిళంలో ఇదే మొదటి సినిమా. ఈ సినిమా విజయం అందుకొంది. దాంతో తమిళ్లో శరత్‌ కుమార్‌తో ‘సురియన్‌’ అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది రోజాకు. ఈ సినిమా కూడా విజయవంతమైంది. ఈ రెండు సినిమాల వలన తమిళ పరిశ్రమలో హీరోయిన్‌గా రోజా ఎస్టాబ్లిష్‌ అయ్యారు. విజయవంతమైన ‘ముఠా మేస్త్రి’, ‘భైరవ ద్వీపం’, ‘బొబ్బిలి సింహం’, ‘అన్నమయ్య’, ‘అన్న’, ‘పెద్దన్నయ్య’, ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’, ‘శుభలగ్నం’, ‘శ్రీ కృష్ణార్జున విజయం’ వంటి ఎన్నో సినిమాలలో రోజా నటించారు. ఆ తరువాత ‘శంభో శివ శంభో’, ‘గోలీమార్‌’, ‘మొగుడు’, ‘కోడి పుంజు’, ‘వీర’ వంటి సినిమాలలో రోజా సహాయక పాత్రలలో నటించారు.

రోజా చేసిన మరికొన్ని తెలుగు సినిమాలు
‘అత్తకు కొడుకు మామకు అల్లుడు’, ‘అత్త సొమ్ము అల్లుడి దానం’, ‘మొగుడుగారు’, ‘ముగ్గురు మొనగాళ్లు’, ‘పోలీస్‌ బ్రదర్స్‌’, ‘శుభలగ్నం’, ‘బిగ్‌ బాస్‌’, ‘మాతో పెట్టుకోకు’, ‘మాయ బజార్‌’, ‘పోకిరి రాజా’, ‘ఘటోత్కచుడు’, ‘టోపీ రాజా స్వీటీ రోజా’, ‘వజ్రం’, ‘స్వర్ణక్క’, ‘మీ ఆయన జాగ్రత్త’, ‘సుల్తాన్‌’, ‘తిరుమల తిరుపతి వెంకటేశా’, ‘ఫామిలీ సర్కస్‌’, ‘దుర్గ’, ‘సమ్మక్క సారక్క’, ‘పరమ వీర చక్ర’, ‘కోడిపుంజు’, ‘శ్రీ రామ రాజ్యం’, ‘పవిత్ర’, తదితర సినిమాలలో నటించారు రోజా.
రజినీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, విష్ణువర్ధన్, రవిచంద్రన్, కృష్ణ, మమ్మూట్టి, శరత్‌ కుమార్, అక్కినేని నాగార్జున, శ్రీ కాంత్, విజయకాంత్, మురళి, అజిత్‌ కుమార్, సత్యరాజ్, ప్రభు, కార్తీక, ప్రభుదేవా, ప్రశాంత్, జయరాం, వెంకటేష్‌ వంటి అగ్ర కథానాయకులతో స్కీన్ర్‌ షేర్‌ చేసుకొన్నారు రోజా. రోజా తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ సినిమా పరిశ్రమలలో మొత్తం 100 సినిమాలపైగా నటించారు.

రాజకీయ జీవితం
రోజా 1999లో తెలుగు దేశంలో చేరారు. ఆ పార్టీ తెలుగు మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె 2009 ఏపీ రాష్ట్ర ఎన్నికలలో ఓడిపోయారు. 2009లో టీడీపీని వదిలి రోజా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో ఆమె నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆమె మరోసారి నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మళ్ళీ సీటును గెలుచుకున్నారు. రోజాను ఎపిఐఐసి చైర్మన్‌గా నియమించారు.
                                                                                         

బుల్లితెరపై
‘మోడరన్‌ మహాలక్ష్మి’ అనే షోకు రోజా యాంకర్‌గా వ్యవహరించారు. ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘జబర్దస్త్‌’ షోకు రోజా ఓ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. జీ తమిళ్‌లో రోజాపై ‘లక్కా కిక్కా’ అనే షోకి హోస్ట్‌ చేశారు రోజా. తమిళనాడులో ఈ షో భారీ విజయం అందుకొంది. కుటుంబ సమస్యలు పరిష్కరించే టీవీ షో బతుకు జట్కాబండికి కూడా హోస్ట్‌గా వ్యవహరించారు.

వ్యక్తిగతం
తమిళ సినిమా దర్శకుడైన ఆర్‌.కె.సెల్వమణిని రోజా 2002, ఆగష్టు 10న వివాహమాడారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

పురస్కారాలు
1991లో ‘సర్పయాగం’ సినిమాకు నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డు అందుకొన్నారు. 1994లో ‘అన్న’ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డును సంపాదించుకున్నారు. 1998లో ‘స్వర్ణక్క’ చిత్రానికి ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని అందుకొన్నారు. ‘ఉన్నిదతిల్‌ ఎన్నై కొడుతేన్‌’ అనే తమిళ సినిమాకు ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చిత్ర పురస్కారాన్ని 1998లో అందుకొన్నారు. ఇదే సినిమాకు ఉత్తమ నటిగా సినిమా ఎక్సప్రెస్‌ తమిళ్‌ పురస్కారాన్ని సొంతం చేసుకోగలిగారు. 2013లో ‘మోడరన్‌ మహాలక్ష్మి’ అనే టీవీ షోకి ఉత్తమ యాంకర్‌గా మాటీవీ అవార్డును అందుకొన్నారు. 2018లో ఎవర్గీన్ర్‌ హీరోయిన్‌గా జీ తెలుగు అప్సర అవార్డును అందుకొన్నారు.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌    


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.