సినీ సీమకు శరత్తు
ఆజానుబాహుడైన కథానాయకుడు, అందగాడైన విలన్, ఆకట్టుకునే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్, వెరసి శరత్‌ బాబు. హీరోగా పరిచయమై, విలన్‌గా విజృంభించి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సెటిలై తెలుగు తెరను సుసంపన్నం చేసిన శరత్‌ బాబు... తన ఖాతాలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని వేసుకున్నారు. అటు, పెద్ద తెరమీద ఇటు బుల్లి తెరమీద... మాధ్యమం ఏదైనా నట విశ్వరూపం చూపించారు. జులై 31న పుట్టిన రోజు జరుపుకుంటోన్న శరత్‌ బాబుపై ప్రత్యేకం.
                                                          
వ్యక్తిగతం
శరత్‌ బాబు అనేది స్కీన్ర్‌ నేమ్. ఈ యాక్టర్‌ అసలు పేరు సత్యం బాబు దీక్షిత్‌. పుట్టింది జులై 31, 1951వ సంవత్సరంలో. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస శరత్‌ బాబు స్వస్థలం. 1973 నుంచి సినిమాల్లో నటుడుగా కొనసాగుతున్నారు.

పోలీస్‌ కావాలనుకుని యాక్టరై....
శరత్‌ బాబు తండ్రికి ఓ హోటల్‌ బిజినెస్‌ ఉంది. కొడుకుకు హోటల్‌ బిజినెస్‌ను అప్పగించాలని తండ్రి భావించారు. కానీ, శరత్‌ బాబుకు పోలీస్‌ ఆఫీసర్‌ అవ్వాలని ఉండేదట. అయితే, కాలేజీ రోజుల్లో, దృష్టి లోపం సమస్య తలెత్తడంతో పోలీస్‌ ఆఫీసర్‌ అవ్వాలనే తన కలలు కాస్త నెరవేరకుండా పోయాయని శరత్‌ బాబు చెబుతారు. పోలీసు ఆఫీసర్‌కు దృష్టి సమస్యలు ఉండకూడదు. ఈ విధంగా పోలీసు ఆఫీసర్‌ అవ్వాలన్న శరత్‌ బాబు కల నెరవేరకుండా పోయిందట. అయితే, అప్పుడు ‘మీ అబ్బాయి చాలా అందంగా ఉంటాడు, సినిమాలలోకి పంపించవచ్చు కదా’ అని శరత్‌ బాబు తల్లితో తెలిసినవాళ్లు అనేవారట. శరత్‌ బాబు చదివే కాలేజీలో కూడా లెక్చరర్లు ఈ విధంగానే అనేవారట. దాంతో, సినిమాలలోకి ట్రై చేయాలని శరత్‌ బాబుకు అనిపించేదట. తండ్రికి ఇష్టం లేకపోయినా తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో సినిమాల్లోకి రావాలని శరత్‌ బాబు నిర్ణయించుకున్నాడట. సినిమాల ప్రయత్నంలో విఫలమయినా ఫ్యామిలీ రన్‌ చేస్తోన్న వ్యాపారంలోకి దిగవచ్చన్న ధీమాతో శరత్‌ బాబు ఉండేవారట. కానీ, మనస్సులో మాత్రం వ్యాపారం, రాజకీయాలు వంటివి అతనికి ఫిట్‌ కావని బాగా తెలుసట ఈ యాక్టర్‌కి. పేపర్‌లో ఒకసారి నటీనటులు కావాలనే యాడ్‌కి స్పందించిన శరత్‌ బాబు ఆ ఆడిషన్‌కి అటెండ్‌ అయ్యారట. అనుకున్నదానికన్నా ఎంతో సులభంగా అందులో సెలెక్ట్‌ అయ్యారట.

తొలి సినిమా ‘రామరాజ్యం’
శరత్‌ బాబు తొలి చిత్రం ‘రామరాజ్యం’. ఈ చిత్రం 1973లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తరువాత శరత్‌ బాబు వరుసగా ‘కన్నె వయసు’, ‘పంతులమ్మ’, ‘అమెరికా అమ్మాయి’ సినిమాలలో నటించారు. ఆ తరువాత బాలచందర్‌ దర్శకత్వంలో ‘చిలకమ్మ చెప్పింది’ చిత్రంలో నటించారు.

బాలచందర్‌ స్టూడెంట్‌... శరత్‌ బాబు
తమిళ్లోకే. బాలచందర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శరత్‌ బాబు కెరీర్‌కి బ్రేక్‌ ఇచ్చింది. ఆ సినిమా తెలుగులో ‘ఇది కథ కాదు’ అనే టైటిల్‌తో రీమేక్‌ అయింది. ఈ సినిమాలో కమల్‌ హాసన్, చిరంజీవి కూడా నటించారు. ఈ చిత్రం ఎంతో పెద్ద విజయమయింది. బాలచందర్‌ దర్శకత్వం వహించిన ‘మరో చరిత్ర’, ‘గుప్పెడు మనసులు’, ‘అంతులేని కథ’, ‘అందమైన అనుభవం’ వంటి ఎన్నో సినిమాలలో నటించారు. ఒక నటుడుగానే కాకుండా బాలచందర్‌ స్టూడెంట్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు శరత్‌ బాబు.


వివిధ భాషలు... వైవిధ్యభరితమైన పాత్రలు
శరత్‌ బాబు తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మరియు మలయాళం భాషలలో నటించి తన నట విశ్వరూపాన్ని చూపించారు. సినిమా ఇండస్ట్రీలో శరత్‌ బాబు సుమారు 37 సంవత్సరాలుగా ఎన్నో సినిమాలలో వివిధ పాత్రలు పోషింస్తున్నారు. రెండు వందల సినిమాలకు పైగా నటించి ప్రేక్షకులను అలరించారు ఈ స్టార్‌. అయితే, ఎక్కువ ఈ యాక్టర్‌ సపోర్టింగ్‌ రోల్స్‌లోనే నటించారు. శివాజీ గణేశన్, రజినీకాంత్, కమల్‌ హాసన్, మరియు చిరంజీవి వంటి స్టార్ల సినిమాలలో సపోర్టింగ్‌ రోల్స్‌లో నటించి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేశారు. 80కు పైగా తెలుగు, తమిళ సినిమాలలో, 20 కన్నడ సినిమాలు, కొన్ని మలయాళ సినిమాలు... ఇవి శరత్‌ బాబు కెరీర్‌ ప్రస్థానం.

ఎన్నో సినిమాలలో...
శరత్‌ బాబు పేరు వినగానే మనకు ఎన్నో సినిమా పేర్లు వెంటనే గుర్తుకువస్తాయి. ‘తాయారమ్మ బంగారయ్య’, ‘మూడు ముళ్ల బంధం’, ‘సీతాకోక చిలుక’, ‘యమకింకరుడు’, ‘సాగర సంగమం’, ‘సితార’, ‘కాంచన గంగ’, ‘అగ్ని గుండెం’, ‘అన్వేషణ’, ‘స్వాతి ముత్యం’, ‘జీవన పోరాటం’, ‘డబ్బెవరికి చేదు’ వంటి ఎన్నో సినిమాలలో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు శరత్‌ బాబు. 
 
                             

అగ్ర దర్శకులతోనూ పని చేసిన శరత్‌ బాబు
శరత్‌ బాబు ఎంతోమంది అగ్రదర్శకులతో పని చేశాడు. ముత్యాల సుబ్బయ్య, బాపు, భారతీరాజా, కె.విశ్వనాథ్, వంశీ, క్రాంతి కుమార్, వంటి ఎంతోమంది అగ్రదర్శకుల సినిమాలలో ఎన్నో రకాల పాత్రల్లో నటించి విలక్షణమైన నటుడుగా పేరు సంపాదించుకొన్నారు శరత్‌ బాబు.

అవార్డులు
శరత్‌ బాబు నటుడుగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. వాటిలో నంది అవార్డులు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడిగా, ఉత్తమ సహాయ నటుడిగా ఎనిమిది సార్లు నంది అవార్డు అందుకొన్న ఘనత శరత్‌ బాబుకే దక్కుతుంది. ‘మలయన్‌’ సినిమాకు గాను బెస్ట్‌ మేల్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డు కూడా అందుకొన్నారు ఈ యాక్టర్‌. ఓ తమిళ సినిమాకి గాను బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌గా నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు గెలుచుకునే స్థాయికి వెళ్లారనీ శరత్‌ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

బుల్లితెరపై కూడా నటవిశ్వరూపం
శరత్‌ బాబు బుల్లితెర ప్రేక్షకులను కూడా పలరించారు. బుల్లితెరపై కూడా తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఈటీవీలో ప్రసారమైన ‘అంతరంగాలు’ సీరియల్‌లో శరత్‌ బాబు హీరోగా నటించారు. ఈ సీరియల్‌తో తెలుగు బుల్లితెర ప్రేక్షకుల మనస్సులో కూడా చెదరని ముద్ర వేసుకున్నారు. శరత్‌ బాబు తెలుగులో ఒకేఒక్క సీరియల్‌ ద్వారా ప్రేక్షకులను పలకరిస్తే... తమిళంలో మాత్రం నాలుగు సీరియల్లో నటించారు. ఆ విధంగా తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యారు శరత్‌ బాబు.


వివాహం:
శరత్‌ బాబు, సినీ నటి రామప్రభ వివాహ బంధంతో 1981లో ఒక్కటయ్యారు. అయితే, కొన్ని కారణాలవల్ల వీరిద్దరు వివాహమైన కొన్నాళ్లకే విడిపోయారు. ఆ తరువాత శరత్‌ బాబు 1990లో స్నేహ నంబియార్‌ని వివాహమాడారు. ఆ తరువాత ఈ పెళ్లి కూడా విజయవంతం కాలేదు. స్నేహ నంబియార్, శరత్‌ బాబు కూడా విడిపోయారు.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.