అభిమానుల గుండె లయ... శ్రియ
తొలిసారి ఆమె స్కీన్ర్‌పై కనబడినప్పుడు ప్రేక్షకులు ఆమెను ‘ఇష్టం’గా అక్కున చేర్చుకున్నారు. ఆమె నవ్వితే చాలు ప్రేక్షకుల గుండెల్లో ‘సంతోషం’ కలుగుతుంది. మా అభిమాన నటివి ‘నువ్వే నువ్వే’ అని ఆమెనే చూపించారు టాలీవుడ్‌ ప్రేక్షకులు. కుర్రకారులైతే నీమీద ప్రేమను ‘ఎలా చెప్పను’ అని మనసునే పారేసుకున్నారు. అందుకే నీ ప్రతీ సినిమాకూ అభిమానంతో ‘నేనున్నాను’ అని ప్రతీ ప్రేక్షకుడూ ఆమెతో అన్నారు. ఇంతలా ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసిన ఆమె ఎవరో కాదు... శ్రియ శరన్‌ భట్నాగర్‌. అందం, అభినయం, ఆకర్షణ ఆమె సొంతం.
నేపథ్యం
శ్రియ పూర్తి పేరు శ్రియ శరన్‌ భట్నాగర్‌. పుష్పేంద్ర శరన్‌ భట్నాగర్, నీరజా శరన్‌ భట్నాగర్‌ దంపతులకు 1982 సెప్టెంబర్‌ 11న డెహ్రాడూన్‌లో శ్రియ జన్మించారు. తండ్రి భారత్‌ హెవీ ఎలెక్టిక్రల్స్‌ లిమిటెడ్‌లో పని చేసేవారు. తల్లి కెమిస్ట్రీ టీచర్‌. శ్రియకు అభిరూప్‌ అనే సోదరుడు ఉన్నారు. ఈయన ముంబైలో నివసిస్తున్నారు. ఈ నటి బాల్యం ఎక్కువగా హరిద్వార్‌లో సాగింది. అక్కడ బీఎచ్‌ఈఎల్‌ కాలనీలో వీరి కుటుంబం ఉండేది. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కళాశాలలో సాహిత్యంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ డిగ్రీ పొందారు. శరన్‌ నాట్యం నేర్చుకున్నారు. మొదట తల్లి నీరజా శరన్‌ దగ్గరే కథక్, రాజస్థానీ ఫోక్‌ డాన్స్‌ నేర్చుకొన్నారు శ్రియ. ఆ తరువాత షోవన నారాయణ్‌ దగ్గర కథక్‌ డాన్స్‌ను అభ్యసించారు. కళాశాలలో తన గురువుతో ఎన్నో నాట్య బృందాలలో పాల్గొనేవారు. తన గురువుతో శ్రియ సామాజిక అంశాలపై నృత్య కార్యక్రమాలను రూపొందించేవారు. ప్రసిద్ధ నర్తకిగా గుర్తింపు తెచ్చుకోవాలని శ్రియ ఆశపడ్డారు.


ఉషాకిరణ్‌లో ‘ఇష్టం’గా
కళాశాలలో చదువుతున్నప్పుడు శ్రియకు మొదటిసారిగా కెమెరా ముందు కనిపించే అవకాశం వచ్చింది. నాట్య గురువు సిఫార్సుతో ఒక మ్యూజిక్‌ వీడియోలో అవకాశాన్ని దక్కించుకోగలిగారు శ్రియ. బనారస్‌లో షూట్‌ చేసిన ఈ వీడియో రామోజీ ఫిలిమ్స్‌ దృష్టిలో పడింది. దాంతో ‘ఇష్టం’ సినిమాలో నేహా పాత్రలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకోగలిగారు. అయితే, ఈ సినిమా విడుదల కాకముందే నాలుగు సినిమాల్లో నటించే అవకాశాన్ని సంపాదించుకోగలిగారు. వాటిలో ‘నువ్వే నువ్వే’ సినిమా కూడా ఉంది. ‘సంతోషం’ సినిమా శ్రియకు మొదటి కమర్షియల్‌ విజయాన్ని అందించిన సినిమా.


బాలీవుడ్‌లోకి
మొదటిసారి ‘తుజే మేరీ కసం’ అనే సినిమాతో హిందీ పరిశ్రమకు అడుగుపెట్టారు శ్రియ. ఈ చిత్రంలో రితేష్‌ దేశముఖ్, జెనీలియా డిసౌజ హీరోహీరోయిన్లుగా నటించారు. తెలుగులో శ్రియ నటించిన ‘ఠాగూర్‌’ సినిమా ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డుల వేడుకలో ప్రదర్శనకు నోచుకుంది. అలాగే ఈ సినిమా వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఆ తరువాత తమిళ్లో ‘ఎనక్కు 20 ఉనక్కు 18’ (నీ మనసు నాకు తెలుసు) సినిమాలో తరుణ్, త్రిషలతో స్కీన్ర్‌ని షేర్‌ చేసుకొన్నారు. ఈ చిత్రంలో శ్రియ ఫుట్‌బాల్‌ కోచ్‌గా నటించారు. ‘నేనున్నాను’ సినిమాలో క్లాసికల్‌ గాయనిగా శ్రియ నటించారు.


2005లో 10 సినిమాలు విడుదల
2005 సంవత్సరంలో శ్రియ నటించిన పది సినిమాలు విడుదలైతే... వాటిలో తొమ్మిది తెలుగు చిత్రాలే. వాటిలో ఎక్కువ గుర్తింపు పొందిన చిత్రం ‘ఛత్రపతి’. ఇందులో మొదటిసారి ప్రభాస్‌ సరసన శ్రియ నటించి... ఈ సినిమాలోని నటనకు గానూ మొదటిసారి ఫిలింఫేర్‌ బెస్ట్‌ తెలుగు నటి అవార్డుకు ఎంపిక అయ్యారు. ‘వర్షం’ సినిమా తమిళ రీమేక్‌లో కథానాయికగా తమిళ ప్రేక్షకులను పలకరించారు శ్రియ. 2005లోనే కేవలం మూడంటే మూడు పాత్రలతో రూపొందిన ‘మొగుడు పెళ్ళాం ఓ దొంగోడు’ అనే సినిమాలో నటించారు శ్రియ. ‘బొమ్మలాట’ అనే బాలల సినిమాలో అతిథి పాత్రలో మెరిశారు శ్రియ. ఇది తెలుగులో ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌గా నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డును అందుకొంది.


తమిళ్‌ సూపర్‌ స్టార్‌తో
శంకర్‌ దర్శకత్వంలో రజినీకాంత్‌ హీరోగా రూపొందిన ‘శివాజీ: ద బాస్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం శ్రియను వరించింది. ఈ సినిమాలో శ్రియ నటన విమర్శకుల ప్రశంసలు కూడా అందుకొంది. ఈ సినిమాలోని పోషించిన పాత్ర శ్రియని దక్షిణాది సినిమా పరిశ్రమలోనే ఓ స్టార్‌ హీరోయిన్‌గా మార్చింది. ఈ సమయంలో, ‘దేవదాసు’, ‘మున్నా’, ‘తులసి’ ఇతర సినిమాలలో ప్రత్యేక పాటలలో మెరిశారు.  హిందీ సినిమా ‘ఆవారాపన్‌’లో ముస్లిం యువతి పాత్ర కోసం ఉర్దూ నేర్చుకోవాల్సి వచ్చింది శ్రియకు. హిందీలో నాల్గొవ సినిమా అయినప్పటికీ, ఇదివరకటి సినిమాల ప్రభావం ఇందులో శ్రియపై ఎక్కడా కనిపించదు. అన్నిమతాలు ఒక్కటేనన్న తన ఆలోచనని ఈ చిత్రం బలపర్చిందని వాఖ్యానించారు. ఈ సినిమా రిలీజ్‌ అయిన ఏడాదిలోనే తమిళ సినిమాతోనూ బిజీగా ఉన్నారు శ్రియ. అదే సమయంలో కన్నడంలో ‘అరసు’ అనే సినిమాకి ఓ సన్నివేశంలో అతిథి పాత్రలో మెరిశారు. 2007 సంవత్సరంలో నాలుగు భాషలలో ఆరు చిత్రాల్లో నటించారు శ్రియ.


అమెరికా సినిమాలో
‘ద అదర్‌ ఎండ్‌ ఆఫ్‌ ది లైన్‌’ అనే అమెరికన్‌ సినిమాలో నటించారు శ్రియ. ఇండియన్‌ కాల్‌ సెంటర్‌లో పని చేసే ప్రియా అనే పాత్రను పోషించారు. ఈ సినిమాలోని తన నటనతో విమర్శకుల దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ చిత్రంలోని అమెరికా హీరో అయిన జెస్సితో శ్రియ ఆన్‌ స్కీన్ర్‌ కెమిస్ట్రీ ఎంతో బాగుందని విమర్శకులు ప్రశంసలతో ముంచెత్తారు. ‘కుకింగ్‌ విత్‌ స్టెల్లా’ అనే మరొక ఇంగ్లీష్‌ చిత్రంలోనూ నటించారు. ఈ సినిమా టొరొంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేడుకకు ఎంపిక కాగా... శ్రియ ఆ ఈవెంట్‌కు హాజరయ్యారు.


ఐదేళ్ల తరువాత టాలీవుడ్‌కి
మలయాళ, తమిళ, ఇంగ్లీష్‌ చిత్రాలతో బిజీగానున్న శ్రియ ఐదేళ్ల తరువాత మాస్‌ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిన ‘డాన్‌ శీను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. యాక్షన్‌ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్‌గా విజయవంతమైంది. రొమాంటిక్‌ సీన్లతో, డాన్సులతో ప్రేక్షకుల దృష్టిని శ్రియ ప్రధానంగా ఆకర్షించగలిగారని కొంతమంది విమర్శకులు అభిప్రాయపడ్డారు. 2005 తరువాత 2010వ ఏడాదిలో శ్రియ మళ్ళీ బాగా బిజీ అయ్యారు. నాలుగు భాషలలో ఎనిమిది సినిమాలలో శ్రియ నటించారు. 2011లో తమిళ, మలయాళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న శ్రియ ఆ తరువాతి ఏడాది తెలుగులో ‘నువ్వా నేనా’, ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ ఏడాదిలోనే దీపా మెహతా దర్శకత్వంలో రూపొందుకొన్న ‘మిడ్నైట్స్‌ చిల్డన్ర్‌’ అనే సినిమాలో నటించారు. కెనడాలో ఎన్నో సినిమా వేడుకలలో ఈ చిత్రం ప్రదర్శనకు నోచుకుంది. భారత దేశంలో 2013లో ఈ చిత్రం రిలీజ్‌ అయింది.


మరికొన్ని మెరుపులు
‘జిల్లా ఘజియాబాద్‌’ అనే సినిమాలో హిందీలో మొదటిసారి ఐటెం నెంబర్‌కి చిందులు వేశారు శ్రియ. ఆ తరువాత తెలుగులో ‘పవిత్ర’ సినిమాలో నటించిన శ్రియ ‘మనం’తో అతి పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్నారు. ‘గోపాల గోపాల’ చిత్రంలో వెంకటేష్‌కు జోడీగా నటించారు. హిందీ ‘దృశ్యం’ సినిమాలో అజయ్‌ దేవగన్‌కు భార్యగా నటించి ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయాన్ని అందుకోగలిగింది. ‘ఊపిరి’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో మెరిసిన శ్రియ బాలకృష్ణ వందవ సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ఇంకొన్ని బాధ్యతలు
50వ ఫిలింఫేర్‌ అవార్డుల వేడుకకు ప్రముఖ నటుడు మాధవన్‌తో శ్రియ హోస్ట్‌గా వ్యవహరించారు. 2010లో ఇండియన్‌ ఇంస్టిట్యూట్‌ ఆఫ్‌ మానేజ్మెంట్‌ అహ్మదాబాద్‌ విద్యార్థుల కోసం ప్రసంగం ఇచ్చే అవకాశాన్ని సొంతం చేసుకోగలిగారు శ్రియ. షారుఖ్‌ ఖాన్, అమీర్‌ ఖాన్‌ల తరువాత ఈ అవకాశాన్ని పొందిన మూడవ సెలబ్రిటీగా శ్రియ నిలిచారు. సినిమా మార్కెటింగ్, బ్రాండింగ్‌ గురించి ఉపన్యాసం ఇచ్చారు. 2011లో ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌ విద్యార్థులకు సినిమాల చరిత్ర, సాంస్కృతిక మార్పిడి మాధ్యమంగా సినిమాలు అనే అంశంపై ప్రసంగం ఇచ్చారు.

వివిధ బ్రాండ్స్‌కి మోడల్‌గా
పాండ్స్‌ క్రీం అడ్వటైస్మెంట్‌తో శ్రియ మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత తమిళ నటుడు విజయ్‌తో కోకా కోలా యాడ్‌లో నటించారు. కెరీర్‌ తొలినాళ్లలో ఫెయిర్‌ అండ్‌ లవ్లీ క్రీమ్స్‌ అడ్వటైస్మెంట్స్‌లో కూడా నటించారు. పాంటీన్‌ షాంపూ, శరవణ స్టోర్స్, లక్స్, తాజ్‌ మహల్‌ టీ, హెడ్‌ అండ్‌ షోల్డర్స్‌ కీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా శ్రియ వ్యవహరించారు. అయితే, సాఫ్ట్‌ డ్రింకుల ప్రకటనలలో నటించడానికి శ్రియ ఇష్టపడరు. ఎందుకంటే, సాఫ్ట్‌ డ్రింకుల కారణంగా పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందన్నది శ్రియ ఆలోచన. ఇంకా ఎన్నో బ్రాండ్లకు శ్రియ ప్రచార కర్తగా పని చేశారు.

వ్యక్తిగత జీవితం...
2018లో రష్యన్‌ పారిశ్రామికవేత్త ఆండ్రీ కొశ్చీవ్‌ని వివాహమాడారు. ఈ వివాహం ముంబైలో హిందూ సాంప్రదాయ వేడుక ప్రకారం జరిగింది.

గౌరవాలు, గుర్తింపులు
తెలుగు సినిమాకు కృషి చేసినందుకు శ్రియకు టి.సుబ్బరామి రెడ్డి లలిత కళా పరిషత్‌ అవార్డు వచ్చింది. రెడీఫ్‌ వారు నిర్వహించిన ఓ పోల్‌ ద్వారా భారతీయ ఎంటర్టైన్మెంట్‌లో విజేతలుగా నిలిచిన అగ్రశ్రేణి నటీమణులలో ఒకరిగా స్థానం సంపాదించుకోగలిగారు. 2014లో గ్రేట్‌ ఉమెన్స్‌ పురస్కారాన్ని అందుకోగలిగారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వారి ‘50 మోస్ట్‌ డిజైరబుల్‌ విమెన్‌’ జాబితాలో 2010లో 13వ, 2011లో 15వ, 2012లో 18వ, 2013లో 7వ, 2014లో 5వ, 2015లో 6వ స్థానాల్లో నిలిచారు. హైదరాబాద్‌ టైమ్స్‌ సౌత్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ విమెన్‌ రాంకింగ్స్‌లో 2013లో 3వ, 2014, 2015లలో 2వ, స్థానాలలో నిలిచారు. 2013, 2014, 2015, 2016, 2017 సంవత్సరాలలో సైమా అవార్డులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించారు.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.