అనగనగా ఓ ధీరుడు... అమ్మాయిల కలల రాకుమారుడు

కనురెప్పల నిండా కలర్‌ ఫుల్‌ సినీ స్వప్నాలే. కధలు రాయడంలోనూ ఆసక్తే. అడపాదడపా గొంతు సవరించుకుంటూ సరిగమల్తో సంభాషించడం కూడా ఇష్టవ్యాపకమే. అద్దంలో తనని తాను చూసుకుంటూ నటించడంలోనూ మక్కువ ఎక్కువే. చిన్నతనం నుంచి సృజనాత్మక ప్రపంచంలో తనకంటూ ఓ సముచిత స్థానాన్ని కల్పించుకోవాలనే తపన కూడా అధికమే. ఎంత త్వరగా పెద్దయి...ఇంకెంత త్వరగా సిల్వర్‌ స్కీన్ర్‌ని ఏలుదామన్న పట్టుదలే. ఆ సంకల్ప బలమే ఆ యువకుడిని వీక్షకుల లోకం నుంచి వెండితెరకు పరిచయం చేసింది. యువతుల కలల రాకుమారుడిని చేసింది. భారతీయ వినోదసీమలో వివిధ భాషా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి... అశేష ప్రేక్షకాదరణని విశేషంగా అందుకున్న ఆ నటుడే... సిద్దార్ధ సూర్యనారాయణ్‌. స్కీన్ర్‌ నేమ్‌ సిద్దార్ధ. ఈ నటుడి పుట్టిన రోజు ఏప్రిల్‌ 17. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ యువ నటుడి నట ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిద్దాం.


సిద్దార్ధ ఖాతాలో సూపర్‌ హిట్‌ సినిమాలు

సిద్దార్ధ పేరు చెప్పగానే ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు కళ్ళ ముందు రీళ్లు రీళ్లుగా తిరుగుతాయి. తెలుగు, తమిళ, హిందీ భాషాచిత్రాల్లో నటించడమే కాకుండా స్కీన్ర్‌ రైటర్‌గా, గాయకుడిగా, అభిరుచి గల నిర్మాతగా కూడా సిద్దార్ధ తనని తాను నిరూపించుకున్నాడు. దర్శకుడు శంకర్‌ ‘బాయ్స్‌’ మొదలుకుని ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా?’, ‘బొమ్మరిల్లు’, ‘ఆట’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘ఓయ్‌’, ‘అనగనగా ఓ ధీరుడు’... ఇలా అనేక సినిమాలు చటుక్కున గుర్తొస్తాయి. ‘బొమ్మరిల్లు’ సినిమా సిద్దార్ధ కెరీర్‌లో ‘మెచ్చు’ తునక. పతాక సన్నివేశంలో తండ్రి ప్రకాష్‌రాజ్‌తో చెప్పిన డైలాగులు ఇప్పటికీ జనం నాలుకలపై కదలాడుతూనే ఉన్నాయి.

గాయకుడిగా రాణింపు

గాయకుడిగా కూడా సిద్దార్ధ రాణించాడు. ‘బొమ్మరిల్లు’ సినిమాలో ‘అపుడో ఇపుడో ఎపుడో...కలగన్నానే చెలీ’... అన్న పాట ఎంత హిట్టో చెప్పనవసరం లేదు. ప్రేమికుడిగా ఆ చిత్రంలో సిద్దార్ధ నటన ఆకాశమంత ఎత్తులో ఉంది. అంతకు ముందు కూడా ‘నువ్వొస్తానంటే నే నేవొద్దంటానా।’ చిత్రంలో కూడా ఎన్నారై ప్రేమికుడు సంతోష్‌ పాత్రలో ఎంచక్కా ఒదిగిపోయాడు.

చెన్నయ్‌ చిన్నోడు

సిద్దార్ధ సూర్యనారాయణ్‌ చెన్నయ్‌లో 1979 ఏప్రిల్‌ 17న తమిళ్‌ కుటుంబంలో పుట్టారు. చెన్నయ్‌లోని దేవ్‌ బాయిస్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్లో ప్రాధమిక విద్య పూర్తి చేసిన సిద్దార్ధ న్యూ ఢిల్లీ సర్దార్‌ పటేల్‌ విద్యాలయలో పై చదువులు చదివాడు. న్యూ ఢిల్లీలోని కిరోరి మాల్‌ కాలేజీలో బి.కామ్‌ చదివిన తర్వాత ముంబయ్‌లోని ఎస్పీ జైన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనెజ్మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ ద్వారా ఎంబీఏ చదివాడు. కాలేజీలో ఉండగానే కళా రంగం పట్ల ఇష్టంతో అనేక కార్యక్రమాల్లో పాలుపంచుకుని తన సృజనకు మెరుగులద్దాడు. 1988లో దోమల నివారణకు సంబంధించిన వాణిజ్య ప్రకటనకు 8 భాషలలో డబ్బింగ్‌ చెప్పి ఆశ్చర్యపరచడమే కాకుండా డబ్బింగ్‌ కళాకారుడిగా మీడియా ముందుకు తొలిసారి సిద్దార్ధ వచ్చాడు. వక్తృత్వ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన సిద్దార్థ సిఎన్‌ బి సి మానేజర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును 1999లో స్వీకరించాడు. ఇలా అందివచ్చిన అన్ని అవకాశాలు వినియోగించుకుంటూ తన లక్ష్యమైన సృజనాత్మక రంగంలో కాలు మోపడానికి వివిధ రకాలుగా ప్రయత్నాలు చేశాడు. చదువు పూర్తి కాగానే తన తండ్రి స్నేహితుడు యాడ్‌ డైరెక్టర్‌ జయేంద్రతో పాటు సినిమాటోగ్రాఫర్‌ పీసి శ్రీరామ్‌ సహకారంతో 2001లో మణిరత్నం దగ్గర సహాయ దర్శకుడిగా చేరిపోయాడు. ఆ సంవత్సరమంతా అదే మణిరత్నం దగ్గరే శిష్యరికం చేసాడు. అంతే కాదు... మణిరత్నం సినిమా అయిన ‘కణ్ణత్తిల్‌ ముత్తమితాల్‌’లో అసలు గుర్తింపునకు నోచుకోని బస్‌ ప్రయాణికుడి పాత్రను కొద్దినిముషాలపాటు పోషించాడు.

‘బాయ్స్‌’తో హీరోగా

‘కణ్ణత్తిల్‌ ముత్తమితాల్‌’ సినిమా స్క్రిప్ట్‌ రైటర్‌ సుజాత ప్రోత్సాహంతో శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న ‘బాయ్స్‌’ సినిమా ఆడిషన్‌కి వెళ్లాడు. మణిరత్నంని ఒకసారి కలిసి సలహా అడిగిన తరువాత శంకర్‌ నిర్వహించిన ఆడిషన్‌కి వెళ్లాడు. ఆ మరుసటి రోజే ‘బాయ్స్‌’ చిత్రంలోని మున్నా పాత్రకు ఎంపిక అయ్యాడు. ‘బాయ్స్‌’ కన్నా ముందే మణిరత్నం పొలిటికల్‌ డ్రామా ‘యువ’లో నటించడానికి సంతకాలు చేశాడు. ఇందులో అర్జున్‌ బాలకృష్ణన్‌ పాత్రలో నటించాడు.

ఆ తరువాత ప్రభుదేవా మొదటి సారి దర్శకత్వం వహించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలో నటించాడు. బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా తెలుగు సినిమా పరిశ్రమలో ఓ స్థానం సంపాదించుకొంది ఈ సినిమా. తరువాత తెలుగు సినిమాల్లో ఎక్కువ డిమాండ్‌ ఉన్న హీరోగా సిద్దార్థ్‌ మారిపోయాడు. ఆ తరువాత సిద్దార్థ్‌ కథను సమకూర్చి, స్కీన్ర్‌ప్లేపై దృష్టి సారించిన సినిమా ‘చుక్కల్లో చంద్రుడు’. శివకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని సిద్దార్థ్‌ మొదటిసారి ఓ పాటని కూడా పాడాడు.

‘రంగ్‌ దే బసంతి’ బ్లాక్‌ బస్టర్‌

రాకేష్‌ ఓంప్రకాష్‌ మెహ్రా దర్శకత్వం, నిర్మాణం చేపట్టిన ‘రంగ్‌ దే బసంతి’ సినిమాలో ఆమీర్‌ ఖాన్, మాధవన్, వంటి పెద్ద పెద్ద తారాగణంతో కలిసి నటించాడు. ఇంది బ్లాక్‌ బస్టర్‌ అవడంతో పాటు సిద్దార్థ్‌ కనబర్చిన నటనకు ఎన్నో ప్రశంసలు లభించాయి. ఆ తరువాత తెలుగులో ‘బొమ్మరిల్లు’ ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రధానంగా తండ్రి కొడుకుల మధ్య నున్న బంధం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా అప్పట్లో అంతర్జాతీయంగా ఎక్కువ వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాగా కూడా గుర్తింపు పొందింది. ఆ తరువాత 2007లో ‘ఆట’ సినిమాలో నటించాడు సిద్దార్థ్‌. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్దార్థ్‌తో ఇలియానా మొదటిసారి నటించింది.

ఆ తరువాత సుమారు రెండేళ్ల పాటు సినిమాల నుంచి విరామం తీసుకొన్న సిద్దార్థ్‌ ఎట్టకేలకు ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ‘ఓయ్‌’ సినిమాలో ఓ రొమాంటిక్‌ హీరో పాత్రలో నటించాడు. సిద్దార్థ్‌ రెండవ హిందీ సినిమా ‘స్రైకర్‌’. పీరియడ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఓ క్యారమ్‌ ప్లేయర్‌ జీవితం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలోని తన పాత్ర కోసం క్యారమ్‌ ఆటలో రెండు నెలల పాటు శిక్షణ తీసుకొన్నాడు. ఈ సినిమా ఆశించినంత స్థాయిలో విజయం అందుకోనప్పటికీ... సిద్దార్థ్‌ నటనకు మాత్రం పాజిటివ్‌ రివ్యూస్‌ వచ్చాయి. అదే సంవత్సరం తెలుగులో విడుదల అయిన మరొక సిద్దార్థ్‌ సినిమా ‘బావా’. రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్దార్థ్‌ ఓ గ్రామీణ యువకుడిగా నటించాడు.

‘అనగనగా ఓ ధీరుడు’ ఫాంటసీ ఎపిక్‌

ఆ తరువాత ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ ఎపిక్‌ ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాలో హీరోగా నటించాడు. శ్రుతి హాసన్, మంచు లక్ష్మి ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమయ్యారు. తరువాత తమిళ, తెలుగు భాషల్లో తన మెంటర్, యాడ్‌ డైరెక్టర్‌ జయేంద్ర తెరకెక్కించిన ‘180’ సినిమాలో నటించాడు సిద్దార్థ్‌. రొమాంటిక్‌ కాలేజ్‌ డ్రామా ‘ఓ మై ఫ్రెండ్‌’ సినిమాలో శ్రుతి హాసన్, హన్సికా మోత్వానీలతో కలిసి నటించాడు. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ స్ఫూర్తితో ఓ తమిళ సినిమాని నిర్మించాడు సిద్దార్థ్‌. అది తెలుగులో ‘లవ్‌ ఫెయిల్యూర్‌’గా విడుదల అయింది. ఎనిమిది నెలల పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కించారు. రెండు భాషల్లోనూ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం అందుకొంది.

2013లో 4 భాషల్లో 7 చిత్రాలు

2013లో నాలుగు భాషల్లో ఏడు చలన చిత్రాల్లో సిద్దార్థ్‌ నటించిన సినిమాలు విడుదల అయ్యాయి. అవి ‘మిడ్‌ నైట్స్‌ చిల్డన్ర్‌’, ‘జబర్దస్త్‌’, ‘బాద్షా’, ‘చాష్మే బద్దూర్‌’, ‘ఉదయం ఎన్‌ఎచ్‌4’, ‘సంథింగ్‌ సంథింగ్‌’ సినిమాలు. ఈ ఏడు వైవిధ్యభరితమైన కథలలో తన పాత్రల కోసం ఎంతో కష్టపడ్డాడు. 2014 ప్రారంభం నాటికి... సిద్దార్థ్‌ మూడు తమిళ ప్రాజెక్టులకు వర్క్‌ చేశాడు. ఆ సంవత్సరం విడుదల అయిన మొదటి సిద్దార్థ్‌ సినిమా ‘జిగర్తాండ’. ఇందులో సినిమా దర్శకుడు కావాలనుకునే యువకుడి పాత్రలో నటించారు సిద్దార్థ్‌. ఈ సినిమా మంచి రివ్యూలు రాబట్టుకొంది. 2019లో శశి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శివప్పు మంజల్‌ పచ్చై’లో నటించాడు సిద్దార్థ్‌. 2019 అక్టోబర్‌లో విడుదలయిన ‘ఆరువం’ అనే సూపర్‌ నాచురల్‌ థ్రిల్లర్‌ సినిమా మిక్స్డ్‌ రివ్యూస్‌ రాబట్టుకొంది.

వ్యక్తిగత జీవితం

2003 నవంబర్‌ 3న సిద్దార్థ్, మేఘన వివాహం జరిగింది. న్యూదిల్లీలో కలిసి పెరిగిన వీరు ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. అయితే, 2006 నాటికి విడివిడిగా ఉండడం మొదలుపెట్టిన వీరు 2007 జనవరిలో విడాకులు తీసుకున్నారు.

పురస్కారాలు

సిద్దార్థ్‌ ఖాతాలో ఇంటర్నేషనల్‌ తమిళ్‌ ఫిల్మ్‌ అవార్డ్స్, ఫిలింఫేర్‌ అవార్డ్స్, స్క్రీన్‌ అవార్డు, నార్వే తమిళ్‌ ఫిల్మ్‌ అవార్డు, ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్, తమిళనాడు రాష్ట్ర పురస్కారాలు ఉన్నాయి.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.