చిన్ననాటి కల...సఫలమైన వేళ... నటుడిగా శ్రీకాంత్‌

వెండితెరపై తనని తాను చూసుకోవాలన్న తపన అతడికి చిన్ననాటి నుంచే ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ చిత్రాలు చూస్తూ పెరిగాడు. కత్తి యుద్ధాల రాకుమారులు, భావోద్వేగాల సాంఘిక చిత్రాలను విపరీతంగా అభిమానించాడు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రాగానే... వెనువెంటనే దూసుకొచ్చి వరుస విజయాలు సాధించిన మెగా స్టార్‌ చిరంజీవి అంటే అతడికి అవధుల్లేని అభిమానం. అప్పటి నుంచి చిరంజీవి ఆయన రోల్‌ మోడల్‌. చదువుకుంటున్న సమయంలోనే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా చెన్నయ్‌ చెక్కేసి నటుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోదలిచాడు. చేతిలో నాలుగు వేలరూపాయలతో...చెన్నయ్‌లోని స్టూడియోల చుట్టూ కలయ తిరిగి... ఫిలిం ఎంట్రీకి ఇదే సరైన దారి కాదని భావించి ఇంటి ముఖం పట్టి డిగ్రీ పూర్తి చేసి ఆ తరువాత హైదరాబాద్‌లో సినీ అవకాశాల కోసం ప్రయత్నించి విజయం సాధించిన ఆయనే... శ్రీకాంత్‌. సాధించాలన్న సంకల్పం గుండె నిండుగా ఉంటే సత్ఫలితాలు చేజిక్కుతాయన్న సత్యాన్ని నిరూపించిన శ్రీకాంత్‌ పుట్టిన రోజు మార్చి 23. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన నట, కుటుంబ జీవితం లోని ఆసక్తికర విషయాలు కొన్ని.


కర్ణాటక కుర్రోడు

శ్రీకాంత్‌ 1968 మార్చి 23న కర్ణాటక గంగావతి తాలూక బసపట్టన్న గ్రామంలో జన్మించాడు. కర్ణాటకలోనే బీకాం చదివారు. సినిమాలంటే ఇష్టం ఉండడంతో పరిశ్రమ వైపు వచ్చాడు. 1990లో మధు ఫిల్మ్‌ ఇన్స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ పొందడానికి చేరాడు. అక్కడ ఆరు నెలలు నటనలో శిక్షణ అందుకొన్న శ్రీకాంత్‌ ఆ తరువాత ఆల్బమ్స్‌ పట్టుకొని నిర్మాతల ఆఫీసుల చుట్టూ అవకాశాల కోసం తిరిగాడు.

‘పీపుల్స్‌ ఎన్‌ కౌంటర్‌’లో తొలి అవకాశం

ఉషాకిరణ్‌ మూవీస్‌ ఆఫీసుకు కూడా వెళ్లాడు శ్రీకాంత్‌. ఉషా కిరణ్‌ మూవీస్‌ సంస్థ వారి నిర్మాణంలో మోహన్‌ గాంధీ దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న ‘పీపుల్స్‌ ఎన్‌ కౌంటర్‌’ సినిమాలో నటించడానికి కొంతమంది యువ నటులు కావాలని ప్రకటన వచ్చింది. శ్రీకాంత్‌ శిక్షణ పొందిన మధు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ నుంచే ఆ ఇంటర్వ్యూకు 50 మంది రాగా వారిలో శ్రీకాంత్‌తో సహా దాదాపు 15 మంది ఎంపిక అయ్యారు. ‘పీపుల్స్‌ ఎన్‌ కౌంటర్‌’ సినిమాలో శ్రీకాంత్‌ పోషించిన పాత్ర నక్సలైట్‌ లీడర్‌ పాత్ర. శ్రీకాంత్‌ పేరు పడగానే ఆయన స్వస్థలం గంగావతిలో పెద్ద పండుగ వాతావరణం నెలకొన్నది. 1991లో ఈ చిత్రం రిలీజ్‌ అయ్యింది.

మెగాస్టార్‌ స్ఫూర్తి

సినిమాల్లో నటించాలన్న స్ఫూర్తిని తనకు కలిగించింది మెగాస్టార్‌ చిరంజీవి అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు శ్రీకాంత్‌. చిరంజీవి సినిమా విడుదల అయిన వెంటనే స్నేహితులతో కలిసి ఆ సినిమాకు వెళ్లేవాడు శ్రీకాంత్‌. చిరంజీవి ఎంట్రీ సీన్‌ వచ్చినప్పుడు అరుపులు మాత్రమే కాకుండా ఐదు పైసల కాయిన్లు, పూలు, పేపర్లు విసురుతూ గోలగోల చేసేవాడట శ్రీకాంత్‌. చిరంజీవి సినిమాలు చూడడం వలన తనకు సినిమా పరిశ్రమపై క్రేజ్‌ ఏర్పడిందని వివరించాడు శ్రీకాంత్‌.

‘శంకర్‌ దాదా’లో చిరంజీవితో నటన

మెగాస్టార్‌ చిరంజీవి తన స్ఫూర్తి అని చెప్పిన శ్రీకాంత్‌... ఆయన పక్కన ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ సినిమాలో నటించడం విశేషం. చిరంజీవితో కలిసి నటిస్తానని తాను ఊహించలేదని అన్నాడు. వాస్తవానికి సినిమా పరిశ్రమకే వస్తానని తాను అనుకోలేదని కూడా అన్నాడు. శ్రీకాంత్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్నప్పుడు సారధి స్టూడియోలో ‘స్టువర్టుపురం పోలీసు స్టేషన్‌’ సినిమాలోని పాట షూటింగ్‌ జరుగుతోంది. అప్పుడు స్టూడియోకి వచ్చి చిరంజీవి నటిస్తుంటే ఆయన్ను చూస్తూ ఉండిపోయేవాడట శ్రీకాంత్‌.

‘ఆమె2తో నిజజీవితంలో భార్యాభర్తలైన శ్రీకాంత్, ఊహ కలిసి ‘ఆమె’ సినిమాలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే తమ పరిచయం అయిందని శ్రీకాంత్‌ చెప్పారు. ‘ఆమె’ సినిమా లేడీ ఓరియెంటెడ్‌ సినిమా కాబట్టి రమ్యకృష్ణ లాంటి అగ్ర హీరోయిన్లను చిత్రబృందం ఎంపిక చేస్తుందేమోననీ, అలాగైతే తన కెరీర్‌కి కూడా హెల్ప్‌ అవుతుందని శ్రీకాంత్‌ భావించారట. అయితే, కొత్త హీరోయిన్‌ని పరిచయం చేయాలని చిత్రబృందం భావించింది. అప్పటికే తమిళ, మలయాళ భాషలలో నటించిన ఊహను ఎంపిక చేసింది ‘ఆమె’ సినిమా బృందం. మొదటిసారి ఊహను చూసిన శ్రీకాంత్‌ ‘ఇంత లావుగా ఉందేమిటి’ అని అనుకున్నాడట. అయితే ఊహ కళ్ళు బాగున్నాయని అనుకున్నాడట. మొత్తానికి ఊహ, శ్రీకాంత్‌ కలిసి ‘ఆమె’ సినిమాలో నటించాడు.

ఊహతో నాలుగు సినిమాలు

‘ఆమె’ సినిమా షూటింగ్‌ టైంలో స్నేహంగా వీరి పరిచయం మొదలయింది. ఊహ, శ్రీకాంత్‌ కలిసి నాలుగు సినిమాలలో నటించారు. ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్‌కు ఊహను పిలిచేవాడు శ్రీకాంత్‌. అలా మెల్లిగా శ్రీకాంత్‌ కుటుంబసభ్యులకు ఊహ అలవాటయ్యారు. ఆ తరువాత ఇరువురి ఇంట్లో ఒప్పుకోవడంతో శ్రీకాంత్‌ - ఊహ వివాహం 1997లో జరిగింది. వీరికి రోషన్, మేధా, రోహన్‌ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.

‘నిర్మలా కాన్వెంట్‌’ పై

శ్రీకాంత్‌ కుమారుడు రోషన్‌ ‘నిర్మలా కాన్వెంట్‌’లో హీరోగా నటించిన విషయం తెలిసిందే. వాస్తవానికి తన కుమారుడిని సినిమాల్లోకి అంత చిన్న వయసులో పరిచయం చేయడం తనకు ఇష్టం లేదని శ్రీకాంత్‌ అన్నాడు. అయితే, గుర్తుగా ఉంటుందని ‘రాణి రుద్రమదేవి’ సినిమాలో చిన్నప్పటి రానా పాత్రలో రోషన్‌ చేత నటింపజేశానని కూడా శ్రీకాంత్‌ అన్నాడు. ఒకసారి ‘నిర్మలా కాన్వెంట్‌’ చిత్రబృందం శ్రీకాంత్‌కు ‘నిర్మలా కాన్వెంట్‌’ కథ చెప్పగా మొత్తం విన్న తరువాత ‘ఇందులో చేయడానికి నాకేం ఉంది’ అని శ్రీకాంత్‌ అన్నాడట. ఈ సినిమాలో రోషన్‌ హీరోగా నటిస్తే బాగుంటుందని ‘నిర్మలా కాన్వెంట్‌’ చిత్రబృందం చెప్పడంతో రెండు రోజులు టైం కావాలని శ్రీకాంత్‌ అన్నాడు. ఈ సినిమా సంగతి చెబితే రోషన్‌ ఎంతో ఆసక్తితో ఒప్పుకున్నారని వివరించాడు శ్రీకాంత్‌. షూటింగ్‌ జరుగుతున్నప్పుడు శ్రీకాంత్‌ - ఊహ షూటింగ్‌ స్పాట్‌కి వెళ్ళలేదు. కేవలం తాతగారితో రోషన్‌ సినిమా షూటింగ్‌ స్పాట్‌కి వెళ్లేవాడు. ఈ సినిమాలో రోషన్‌ నటన శ్రీకాంత్‌కు ఎంతో నచ్చింది.

దాదాపు 15 సినిమాలలో విలన్‌గా ఎవరైనా హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వస్తారని తాను కూడా హీరో అవ్వాలనే వచ్చానని అన్నాడు శ్రీకాంత్‌. ‘పీపుల్స్‌ ఎన్‌ కౌంటర్‌’ సినిమా తరువాత ‘మధురా నగరిలో’ సినిమాలో నలుగురు హీరోల్లో ఒకరిగా నటించినట్టు గుర్తుకు తెచ్చుకున్నాడు శ్రీకాంత్‌. ఆ సినిమా హిట్‌ అయినప్పటికీ ఆరు నెలలైనా శ్రీకాంత్‌కు సినిమా పరిశ్రమ నుంచి ఒక్క అవకాశమూ రాలేదు. తనకు ఎటువంటి ఫోన్‌ కాల్‌ రావడం లేదు సినిమా పరిశ్రమ నుంచి అని శ్రీకాంత్‌ అనుకుంటున్న సమయంలో ఈవీవీ నుంచి ‘సీతారత్నం గారి అబ్బాయి’ సినిమాలో అవకాశం వచ్చింది. అయితే, అది విలన్‌ పాత్ర. విలన్‌ పాత్ర వచ్చిందేమిటి అని శ్రీకాంత్‌ మొదట అనుకున్నాడట. ఆ తరువాత సన్నిహితులు, స్నేహితులకు చెబితే సినిమా పరిశ్రమలో ఉండడం ముఖ్యం అని వారు అనడంతో ఆ పాత్రలో నటించాడు శ్రీకాంత్‌. ఆ తరువాత ‘ప్రెసిడెంట్‌ గారి పెళ్ళాం’, ‘అబ్బాయి గారు’ తదితర సినిమాలో విలన్‌గా నటించాడు శ్రీకాంత్‌.

విలన్‌ నుంచి హీరోగా

అలా విలన్‌ పాత్రలు చేస్తున్నప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్‌ నిర్మాణంలో ‘వన్‌ బై టు’ చిత్రంలో హీరోగా నటించే అవకాశం వచ్చింది శ్రీకాంత్‌కు. ఇందులో జెడి చక్రవర్తితో స్కీన్ర్‌ షేర్‌ చేసుకొన్నాడు శ్రీకాంత్‌. ఈ సినిమాలో హీరోగా చేస్తున్నందున ఈ సినిమా షూటింగ్‌ మొదలయ్యే సమయానికే విలన్‌గా చేస్తోన్న తన సినిమాలు పూర్తి అయిపోవాలని తమ్మారెడ్డి భరద్వాజ్, శ్రీకాంత్‌కు కండిషన్‌ పెట్టాడట. అలాగే చేశాడు శ్రీకాంత్‌. ఈ సినిమా విడుదల అయిన తరువాత హీరోగా సెటిల్‌ అయ్యాడు శ్రీకాంత్‌. కెరీర్‌లో బ్రేక్‌ ఇచ్చిన సినిమాలు తన కెరీర్‌లో బ్రేక్‌ ఇచ్చిన సినిమాలు ‘ఆమె’, ‘తాజ్‌ మహల్‌’, ‘పెళ్లి సందడి’, ‘వినోదం’, ‘ఆహ్వానం’, ‘ఎగిరే పావురమా’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నాడు శ్రీకాంత్‌.

ఇష్టమైన హీరోయిన్‌ సౌందర్య

తనకు ఇష్టమైన నటి సౌందర్య అని అన్నాడు. తామిద్దరి కాంబినేషన్‌లో ఐదు సినిమాలు వచ్చాయని చెప్పాడు. ‘తారక రాముడు’తో మొదలైన వారి కలయిక ఆ తరువాత ‘నిన్నే ప్రేమిస్తా’, ‘కలిసి నడుద్దాం’, ‘మానసిస్తా రా’ సినిమాలు ఉన్నాయి. సౌందర్య నటన అంటే తనకు ఇష్టమని అన్నాడు శ్రీకాంత్‌.

శ్రీకాంత్‌ కెరీర్‌ని మలుపు తిప్పిన సినీ ప్రముఖులు

తమ్మారెడ్డి భరద్వాజ్, ఈవీవీ సత్యనారాయణ, కృష్ణారెడ్డి, రాఘవేంద్రరావు, కృష్ణవంశీ శ్రీకాంత్‌ కెరీర్‌ ని మలుపు తిప్పారు. నిర్మాత నిరాకరణ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖడ్గం’ చిత్రంలో శ్రీకాంత్‌ది ఎంతో భావోద్వేగభరితమైన పాత్ర అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కన్నా ముందు శ్రీకాంత్‌ దాదాపు ప్రతి సినిమాలో ఆడుతూ పాడుతూ ఉన్న పాత్రలు, కుటుంబ కథాచిత్రాల పాత్రలు ఎక్కువగా చేశాడు. దాంతో, ‘ఖడ్గం’ సినిమాలో సీరియస్‌ క్యారెక్టర్‌లో శ్రీకాంత్‌ సరిపోతారా అని ఓ నిర్మాత సందేహపడ్డారట. కృష్ణవంశీతో కూడా ఈ మాట చెప్పి శ్రీకాంత్‌ని తొలగించమని సలహా ఇచ్చారట ఆ నిర్మాత. అయితే, కృష్ణవంశీకి మాత్రం శ్రీకాంత్‌పై ఎంతో నమ్మకం ఉంది. సీరియస్‌ పాత్ర అయినా శ్రీకాంత్‌ బాగా చేయగలరని ఆ నిర్మాతతో అన్నారట. శ్రీకాంత్‌ని తొలగించి వేరే నటుడికి ఆ పాత్ర ఇస్తే ‘ఖడ్గం’ సినిమాపై ఎక్కువ డబ్బులు పెడతానని ఆ నిర్మాత కృష్ణవంశీతో అన్నారని ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్‌ చెప్పాడు. అయితే, అప్పుడు కృష్ణవంశీ నేను వేరే నిర్మాతతో శ్రీకాంత్‌ తోనే ×ఖడ్గం× సినిమా తెరకెక్కిస్తానని అన్నారని శ్రీకాంత్‌ చెప్పారు. మొత్తానికి ‘ఖడ్గం’ సినిమాలో శ్రీకాంత్‌ నటించారు.

100వ సినిమా ‘మహాత్మ’

కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, భావన హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘మహాత్మ’ సినిమా శ్రీకాంత్‌ 100వ సినిమా. ఏ హీరో అయినా వందవ సినిమా అనగానే అది ఒక మైలురాయిగా ఉండాలనుకుంటారు. అలాగే తాను కూడా అనుకున్నట్టు చెప్పాడు శ్రీకాంత్‌. కమర్షియల్‌గా ఉంటూనే మెసేజ్‌ ఉన్న కధాంశంతో సినిమా చేయాలని శ్రీకాంత్‌ అనుకున్నాడట. ఆ సమయంలో కృష్ణవంశీ ‘మహాత్మ’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది శ్రీకాంత్‌కు. నటుడిగా ఆ సినిమా వంద శాతం సంతృప్తి కలిగించిందని అన్నాడు. అయితే, సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదని అన్నాడు. మొదట అనుకున్నదాని కంటే ఆ తరువాత బడ్జెట్‌ పెరిగిందని అన్నాడు. మొదట అనుకొన్న బడ్జెట్‌కి అయితే సినిమా విజయంపై నిర్మాతతో సహా అందరూ సంతోషంగా ఉన్నారని అన్నాడు శ్రీకాంత్‌.

విశ్వనాధ్, బాపు దర్శకత్వంలో ఏ నటుడికైనా విశ్వనాధ్, బాపు దర్శకత్వంలో నటించాలని ఉంటుంది. అటువంటి అవకాశం అందిపుచ్చుకొన్న వారిలో శ్రీకాంత్‌ ఒకరు. విశ్వనాధ్‌ దర్శకత్వంలో ‘స్వరాభిషేకం’ బాపు దర్శకత్వంలో ‘రాధాగోపాళం’ చిత్రాలలో నటించాడు శ్రీకాంత్‌. ‘స్వరాభిషేకం’ సినిమాలో చివరిలో తనకు గొంతు పోయే సీన్‌ ఉందని, ఆ సన్నివేశాన్ని ఇప్పటికీ చూస్తూ ఉంటానని అన్నాడు శ్రీకాంత్‌. అలాగే బాపు ‘రాధాగోపాళం’ సినిమా షూటింగ్‌ టైంలో పొద్దునే సన్నివేశాన్ని చూసేవాడినని, ఆ సీన్‌ పక్కన బొమ్మలు ఉండేవని అన్నాడు. అమ్మాయి నిల్చోవడం, అమ్మాయి జడ పొడుగ్గా ఉండడం వంటివి ఆ బొమ్మలో ఉండేవని ఆ బొమ్మలకు తగ్గట్టు చేసేసేవారిమని అన్నాడు శ్రీకాంత్‌. ప్రస్తుతం శ్రీకాంత్‌ ‘మార్షల్‌’, ‘కోటలో రాయుడు’ సినిమాలలో నటిస్తున్నాడు.

పురస్కారాలు

‘మహాత్మ’ సినిమాకు నంది స్పెషల్‌ జ్యూరీ పురస్కారం శ్రీకాంత్‌ని వరించింది. ‘శంకర్‌ దాదా ఎం.బి.బి.ఎస్‌’ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడి విభాగంలో ఫిలింఫేర్‌ పురస్కారం అందుకొన్నాడు శ్రీకాంత్‌. ‘సరైనోడు’ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడి విభాగంలో సైమా పురస్కారం అందుకొన్నారు శ్రీకాంత్‌.

- పి.వి.డి.ఎస్‌. ప్రకాష్‌Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.