ఝుమ్మంది అందం

సొట్టబుగ్గల తాప్సి ప్రస్తుతం బాలీవుడ్‌లో రాణించే ప్రయత్నం చేస్తోంది. మధ్యలో అవకాశం దొరికినప్పుడంతా తెలుగులో నటిస్తోంది. ఉత్తరాది చిత్రాల్లో నటిస్తున్న ఉత్తరాది భామే అయినా... తాప్సికీ, తెలుగు చిత్ర పరిశ్రమ మధ్య అనుబంధం విడదీయలేనిది. తెలుగు చిత్రం ‘ఝుమ్మంది నాదం’తోనే తెరకు పరిచయమైంది తాప్సి. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో తాప్సి అందం కుర్రకారునీ, అలాగే చిత్ర పరిశ్రమనీ విశేషంగా ఆకట్టుకుంది. దాంతో వరుసగా ఆమెకి అవకాశాలు వెల్లువెత్తాయి. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకొంది. 1987 ఆగస్టు 1న దిల్లీలో జన్మించిన తాప్సి ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ప్రయాణం ఆరంభించింది. ఆ తర్వాత మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది. పలు వాణిజ్యప్రకటనల్లో నటించి గుర్తింపు తెచ్చుకొన్న తాప్సి, మంచు లక్ష్మి దృష్టిలో పడింది. ఆమె నిర్మించిన ‘ఝుమ్మంది నాదం’తోనే తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘వస్తాడు నా రాజు’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘వీర’, ‘మొగుడు’, ‘దరువు’, ‘గుండెల్లో గోదారి’, ‘సాహసం’, ‘కాంచన2’, ‘దొంగాట’, ‘ఘాజీ’, ‘ఆనందో బ్రహ్మ’ తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించింది. తమిళ చిత్రం ‘ఆడుకలమ్‌’ ఆరు జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకొంది. ‘గుండెల్లో గోదారి’లో నటనకి కూడా మంచి పేరొచ్చింది. మాలాంటి వాళ్లకు తోటి నటులతో ప్రేమాయణం ఫలించదని నమ్ముతానని తాప్సి చెబుతుంటారు. డానిష్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మాథియస్‌ బోయేతో తాప్సి ప్రేమలో ఉన్నారని ప్రచారం సాగింది అప్పట్లో. ఈమె కె.రాఘవేంద్రరావు శైలి గురించి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘నీవెవరో’ చిత్రం తరువాత జూన్‌ 2019లో వచ్చిన ‘గేమ్‌ఓవర్‌’ అనే సినిమా మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అక్షయ్‌కుమార్‌తో కలిసి ‘మిషన్‌ మంగళ్‌’ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం తాప్సి ‘హసీన్‌ దిల్‌రుబా’, ‘లూప్‌ లాపెట’, షబాస్‌ మిత్తు’ అనే చిత్రాల్లో నటిస్తుంది. ఈరోజు తాప్సి పుట్టినరోజు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.