‘విక్టరీ’... వెంకటేష్‌
article imageవిక్టరీ వెంకటేష్‌గా పేరుపొందిన దగ్గుబాటి వెంకటేష్‌.. ప్రసిద్ధ నిర్మాత డి.రామానాయుడి రెండవ కుమారుడు. తల్లి రాజ్యలక్ష్మి. 1960 డిసెంబరు 13న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా, కారంచేడులో జన్మించారు. వెంకటేష్‌ భార్య నీరజ. వీరికి ముగ్గురు అమ్మాయిలు (ఆశ్రిత, హయవాహిని, భావన), ఒక కుమారుడు (అర్జున్‌ రామంత్‌). వెంకటేష్‌ 1986లో ‘కలియుగ పాండవులు’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. వెంకటేష్‌ కథానాయకుడిగా విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘స్వర్ణకమలం’లో అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అందులో వెంకటేష్‌ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత వెంకటేష్‌కు కొన్ని అపజయాలు ఎదురైనా ‘బొబ్బిలి రాజా’, ‘సుందరకాండ’, ‘కూలీ నం.1’, ‘ప్రేమ’, ‘కొండపల్లి రాజా’, ‘సూపర్‌పోలీస్‌’, ‘ముద్దుల ప్రియుడు’ సినిమాలతో ప్రేక్షకులను అలరించి మంచి హిట్లు అందుకున్నారు. ఇక రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘క్షణక్షణం’ వెంకటేష్‌కు గొప్ప విజయాన్నిచ్చింది. ఆ తర్వాత 1991లో వచ్చిన ‘చంటి’లో అమాయకమైన యువకునిగా వెంకటేష్‌ చూపిన అభినయానికి ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు లభించింది. అంతకముందు వరకు ఆవేశపూరిత పాత్రల్లో కనిపించిన వెంకటేష్‌.. ‘చంటి’లోని అమాయకమైన నటనతో మహిళా ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. దీని తర్వాత చాలా సినిమాల్లో వెంకటేష్‌ ఫ్యామిలీ హీరో పాత్రలను ధరించారు. ఆయన ఆధ్యాత్మిక భావాలున్న వ్యక్తి. ఆయన నటించిన చిత్రాలన్నీ ఎక్కువగా వినోదాత్మకంగా, కుటుంబ సమేతంగా చూడదగినవిగా ఉంటాయి.

 ‘ధర్మ చక్రం’, ‘పవిత్ర బంధం’, ‘గణేష్‌’, ‘సూర్యవంశం’, ‘రాజా’, ‘జయం మనదేరా!’, ‘వసంతం’, ‘ఘర్షణ’, ‘సంక్రాంతి’, ‘లక్ష్మీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ‘దృశ్యం’, ‘గురు’ వంటి హిట్టు చిత్రాలతో ప్రేక్షకుల మదిలో విక్టరీ వెంకటేష్‌గా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఆయన. ఇక ‘నువ్వునాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’, ‘నమో వెంకటేశ’, ‘బాబు బంగారం’ సినిమాల్లో వెంకటేష్‌ తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్వుల జల్లుల్లో తడిపేశారు. ఇప్పుడున్న కథానాయకుల్లో మల్టీస్టారర్‌ సినిమాలు చేయడంలో వెంకటేష్‌ అందరికంటే ముందున్నారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో మహేష్‌బాబుతో కలిసి నటించిన వెంకీ, ‘మసాల’లో యువహీరో రామ్‌తో, ‘గోపాల గోపాల’లో పవన్‌కళ్యాణ్‌తో కలిసి నటించి మెప్పించారు. వీటితో పాటు ‘సోగ్గాడు’, ‘ప్రేమమ్‌’, ఇటీవల విడుదలైన ‘అజ్ఞాతవాసి’ల్లో అతిథి పాత్రల్లో కనిపించి మెరిపించారు. ఆయన నటించిన సోసియోఫాంటసీ చిత్రాలు ‘సాహస వీరుడు సాగర కన్య’, ‘దేవీ పుత్రుడు’ వెంకీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

వెంకటేష్‌ తన సినిమాల ద్వారా చాలా మంది హీరోయిన్స్‌ను తెలుగు తెరకు పరిచయం చేశారు. వీరిలో ఫరా, టబు, దివ్యభారతి, గౌతమి, ప్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతిజింతా, కత్రినా కైఫ్, అంజలా జవేరి వంటి వారున్నారు. తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’తోనే నంది అవార్డు అందుకున్న వెంకటేష్‌కు.. ‘ప్రేమ’, ‘ధర్మచక్రం’, ‘చంటి’, ‘స్వర్ణకమలం’, ‘గణేష్‌’, ‘కలిసుందాం రా’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలు నంది పురస్కారాలనందించాయి.
సంబంధిత ఫోటోలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.