విజయనిర్మల జీవితంలో మధుర జ్ఞాపకాలు
తెలుగు చిత్రపరిశ్రమలో నటిగానే కాకుండా దర్శకురాలిగానూ తనదైన ముద్రవేశారు విజయనిర్మల. ఏడో ఏటనే బాలనటిగా వెండితెరకు పరిచయమైన ఆమె చిన్నప్పుడు దాదాపు అన్ని మగవేషాలే వేశారు. తొలి చిత్రంలో రాజకుమారుడిగా కనిపించిన ఆమె, ‘పాండురంగమహత్మ్యం’లో పాండురంగడిగా మెప్పించారు.


‘‘నేను ఏడో ఏటనే నటించడం మొదలు పెట్టాను. సి.పుల్లయ్య దర్శకత్వంలో ఓ తమిళ చిత్రాన్ని తెలుగులో తీశారు. అందులో ఎస్‌.వరలక్ష్మి కథానాయిక. ఆ సినిమా షూటింగ్‌ జరుగుతుంటే ఏమీ తెలిసేది కాదు. అప్పుడు ఎక్కువగా రాత్రి పూట చిత్రీకరణ జరిగేది. నవ్వమంటే ఏడ్చేదాన్ని. ఏడ్వమంటే నవ్వేదాన్ని. నాకు చిన్నప్పుడు పూరీ పొటాటో అంటే బాగా ఇష్టం. అది తీసుకొచ్చిన నాకు కనపడేలా పెట్టేవారు. దాన్ని చూడగానే నవ్వొచ్చేది. అలా బాలనటిగా ఐదారు సినిమాల్లో నటించాను. చిన్నప్పుడు అన్నీ మగవేషాలే వచ్చేవి. కానీ, ‘భూ కైలాస్‌’లో మాత్రం సీతగా చేశా. ఆ తర్వాత ‘పాండురంగ మహత్మ్యం’లో పాండురంగడిగా నటించా. అసలు నేను నటించిన తొలి సినిమాలోనే చిన్నప్పటి రాజకుమారుడి వేషం వేశా. చిన్నప్పుడు బాగా అల్లరి చేసేదాన్ని. స్కూల్‌ వెళ్లేటప్పుడు అప్పు చేసి మరీ నాతోటి పిల్లలకు చాక్లెట్లు కొనిచ్చేదాన్ని. సాయంత్రం ఆ షాపు వాడు డబ్బుల కోసం మా ఇంటికి వచ్చేవాడు. దీంతో మా అమ్మ బాగా తిట్టేది. అదే నాన్న ఉంటే డబ్బులు ఇచ్చి పంపేవారు. మా ఇంట్లో అందరూ మగపిల్లలే. నేను ఒక్కదాన్నే ఆడపిల్ల కావడంతో గారాబంగా పెంచారు’’ అని తన చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకునేవారు విజయ నిర్మల. ఆ తర్వాత ‘రంగులరాట్నం’తో కథానాయికగా వెండితెరకు పరిచయం అయి, ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు.

* ఆ సినిమా ‘సాక్షి’గా కలిసిన కృష్ణ-విజయ నిర్మల
తెలుగు చిత్రపరిశ్రమలోని జంటలో కృష్ణ-విజయ నిర్మల చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇద్దరూ ప్రముఖ నటులే. ఎన్నో విజయవంతమైన, చరిత్ర సృష్టించిన సినిమాల్లో నటించారు. ‘సాక్షి’ చిత్రంతో తొలిసారి జోడీగా నటించిన వీరు ఆ తర్వాత పలు చిత్రాల్లో కలిసి నటించారు. చివరికి నిజ జీవితంలోనూ భార్యభర్తలు అయ్యారు. విజయ నిర్మల తొలిసారి కృష్ణను చూసింది ఆమె కథానాయికగా పరిచయమైన ‘రంగులరాట్నం’ సెట్‌లోనే. ఆ సినిమా దర్శకుడితో మాట్లాడటానికి కృష్ణ వస్తుండేవారు. ఆ తర్వాత బాపు దర్శకత్వం వహించిన ‘సాక్షి’లో ఇద్దరూ తొలిసారి స్క్రీన్‌ పంచుకున్నారు. ఆ సినిమా షూటింగ్‌ సందర్భంగా జరిగిన సంఘటన వారిద్దరినీ నిజ జీవితంలోనూ అగ్ని ‘సాక్షి’గా ఒకటయ్యేలా చేసింది.
1967లో వచ్చిన ‘సాక్షి’ బాపు తొలి చిత్రం. ఈ సినిమా షూటింగ్‌ కోసం 30రోజులు అవుట్‌డోర్‌ ప్లాన్‌ చేశారు. గోదావరి తీరంలోని పులిదిండిలో గ్రామంలో చిత్రీకరించాలనుకున్నారు‌. ఆ ఊళ్లో ఓ గుడి ఉంది. అందులో కృష్ణుడికి మీసాలు ఉంటాయి. అందుకే భక్తులు ఆయనను మీసాల కృష్ణుడు అంటారు. ఆ దేవుడు మహిమాన్వితుడని అక్కడివారి నమ్మకం. ‘సాక్షి’లో నటించిన హాస్య నటుడు రాజబాబుకి కూడా మీసాల కృష్ణుడి మహత్తు తెలుసు. ఆ చిత్రంలో కృష్ణ, విజయ నిర్మల జంటగా నటించారు. ఆరుద్ర రాసిన ‘అమ్మ కడుపు చల్లగా... అత్త కడుపు చల్లగా... బతకరా పచ్చగా పచ్చగా...’ అనే పాట కోసం కృష్ణ, విజయ నిర్మలను పెళ్లి దుస్తుల్లో అలంకరించి, వారి కొంగులు ముడివేసి ఆ గుడిలోనే చిత్రీకరించారు. అప్పుడు అక్కడే ఉన్న రాజబాబు కొత్త దంపతుల దుస్తుల్లో ఉన్న వారిద్దరినీ చూస్తూ ‘ఇక్కడి మీసాల కృష్ణుడు చాలా పవర్‌ఫుల్‌‌’ అంటూ ఛలోక్తి విసిరారు. ఆయన మాటే నిజమయింది. ఇది జరిగిన రెండేళ్లకే కృష్ణ, విజయ నిర్మల నిజజీవితంలో ఒక్కటయ్యారు.


* కృష్ణ-విజయ నిర్మల ఇదొక రికార్డు!
ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఒక హీరో-హీరోయిన్‌ కలిసి నటించిన చిత్రం విజయం సాధించిందంటే, దర్శక-నిర్మాతలు మళ్లీ అదే జోడీతో సినిమా తీయడానికి ఆసక్తి చూపుతారు. ప్రేక్షకుల సైతం ఆ హిట్‌ పెయిర్‌ మళ్లీ, మళ్లీ రిపీట్‌ కావాలని అనుకుంటారు. అలా ఇప్పటివరకూ చాలామంది నాయకనాయికలు వెండితెరపై సందడి చేశారు. అలాంటి వారిలో కృష్ణ-విజయ నిర్మల ఒకరు. వీరిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం ‘సాక్షి’. బాపు దర్శకత్వం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 47 చిత్రాల్లో నటించారు. ఇదొక రికార్డు. ఇంతవరకూ ఏ జోడీ కలిసి ఇన్ని సినిమాలు చేయలేదు. వీటిల్లో ‘టక్కరి దొంగ చక్కని చుక్క’, ‘విచిత్ర కుటుంబం’, ‘బందిపోటు భీమన్న’, ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘పండంటి కాపురం’, ‘దేవుడు చేసిన మనుషులు’, ‘మీనా’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘దేవదాసు’, ‘పాడిపంటలు’, ‘శ్రావణమాసం’ ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి.


* దర్శకురాలిగా స్ఫూర్తినింపిందీ ‘సాక్షి’
బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’తో కృష్ణ-విజయ నిర్మల కలిసి నటించడమే కాదు, ఎప్పటికైనా దర్శకత్వం వహించాలన్న కోరికకు బీజం పడింది ఈ సినిమాతోనేని విజయ నిర్మల చెప్పేవారు. బాపు టేకింగ్‌ అంటే తనకు చాలా ఇష్టమని అదే తనను దర్శకురాలిని చేసిందని అనేవారు. అలా ‘మీనా’ చిత్రంతో తొలిసారి మెగాఫోన్‌ పట్టిన విజయ నిర్మల 44 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకున్నారు. 

విజయ నిర్మలకు సినీ ప్రముఖ నివాళి
చిత్రమాలిక కోసం క్లిక్‌ చేయండిసంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.