పోలీసు అకాడమీ డీన్‌గా బాబి డియోల్‌!

‘సోల్జర్’‌, ‘బాదల్’‌, ‘హమ్‌రాజ్’, ‘కిస్మత్’‌ లాంటి చిత్రాలతో అలరించిన నటుడు బాబీ డియోల్‌. ప్రస్తుతం పోలీస్‌ అకాడమీ డీన్‌ విజయ్‌ సింగ్‌గా నటిస్తున్నారు. అతుల్‌ సభర్వాల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘క్లాస్‌ ఆఫ్‌ 83’ అనే చిత్రంలో పోలీస్‌ అధికారిగా నటిస్తున్నారు బాబి డియోల్‌. ‘క్లాస్‌ ఆఫ్‌ 83’ - హస్సేన్‌ జైదీ నవల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌‌మెంట్‌ నిర్మిస్తోంది. ఈ సినిమాలో బాబీ డియోల్‌ పోలీస్‌ అకాడమీ డీన్‌ విజయ్‌ సింగ్‌ పాత్రలో నటించారు. ఇందులో ఆయన బ్యూరోక్రసి దాని నేరమిత్రులను శిక్షించడానికి ప్రత్యేకంగా ఐదుగురు ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టులకు శిక్షణ ఇస్తుంటారు. అయితే ఈ సమయంలో విజయ్‌ సింగ్‌ కొన్నాళ్లు పాటు డీన్‌ పదవి నుంచి తప్పుకుంటారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ ఒకటి ఈరోజు విడుదలైంది. ఈ సందర్భంగా బాబీ డియోల్‌ స్పందిస్తూ..‘‘ప్రస్తుతం డిజిటల్‌ మాధ్యమం అందించే వైవిధ్యమైన కంటెంట్‌ నన్నెంతో ఆకర్షించింది. 1980ల నాటి ముంబై చరిత్ర ఒక మనోహరమైన కాలం అది. ఈ చిత్రం మళ్లీ నన్ను ఆరోజుల్లోకి తీసుకెళ్లింది. దర్శకుడు అతుల్‌, నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ నన్ను సంప్రదించినప్పుడు పాత్ర గురించి చెప్పగానే చిత్రంలో నటించాలనిపించింది. దాంతో వెంటనే ఒప్పేసుకున్నా అంటూ..’’ చెప్పారు. ఇంకా చిత్రంలో అనుప్ సోని, జాయ్ సేన్‌గుప్తా, విశ్వజీత్‌లు ప్రధాన పాత్రలో నటించారు. 2019లో మే మొదటి వారంలో చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. గౌరి ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, గౌరవ్‌ వర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న చిత్రానికి అభిజీత్‌ దేశ్‌పాండే కథ అందించగా, విజు షా సంగీత స్వరాలు సమకూర్చారు. సినిమా ఆగస్టు 21న నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.