వారంతంలో ఏం జరిగిందో తెలుస్తుంది.
‘‘నటన అనేది నా పూర్తిస్థాయి వ్యాపకం కాదు. కానీ సినిమా అంటే ప్రత్యేకమైన ప్రేమ. ఆ ప్రేమతోనే ప్రతిసారీ కొత్త రకమైన సినిమాలు చేస్తుంటా. నేనెక్కడ నటించినా నా తొలి ప్రాధాన్యం తెలుగుకే’’ అన్నారు సచిన్‌ జోషి. ‘మౌనమేలనోయి’, ‘ఒరేయ్‌ పండు’, ‘నీ జతగా నేనుండాలి’, ‘వీడెవడు’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆయన నటించిన ‘అమావాస్య’ ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీలోనూ ‘అమావాస్‌’గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా సచిన్‌ జోషి శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

*
‘‘చేస్తే విభిన్నమైన సినిమానే చేయాలనుకొంటున్న దశలో దర్శకుడు భూషణ్‌ పటేల్‌ ‘అమావాస్య’ కథ వినిపించారు. నేను చేసిన చిత్రాలకి పూర్తి భిన్నమైన కథతో ఈ చిత్రం తెరకెక్కింది. హారర్‌ కథల్లోనూ ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. నా గత చిత్రం ‘వీడెవడు?’తో ప్రేక్షకులకు కొత్తదనం పంచాను. అలాంటి చిత్రం తర్వాత ‘అమావాస్య’ చేయడం ఆనందంగా ఉంది’’.

*
‘‘ఇందులో నేను కరణ్‌ అనే ఓ యువకుడిగా కనిపిస్తా. పెళ్లికి సిద్ధమైన జంట ఓ బంగళాకి ఎందుకు వెళ్లింది? అక్కడ వారాంతం తర్వాత ఏం జరిగిందనేదే ఈ చిత్రం. నర్గీస్‌ ఫక్రీ ఇందులో కథానాయిక. ఆమె పాత్ర కూడా ప్రేక్షకుల్ని థ్రిల్‌కి గురిచేస్తుంది. హారర్‌ చిత్రాలనగానే హాలీవుడ్‌ సినిమాల్ని గుర్తు చేస్తుంటారు. ఆ సినిమాల్లో నాణ్యత ప్రేక్షకులకి నచ్చుతుంటుంది. అలాంటి అనుభూతిని పంచేలా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు భూషణ్‌ పటేల్‌. ఆయన హారర్‌ చిత్రాల స్పెషలిస్ట్‌. ‘‘1920’, ‘రాగిణి ఎమ్‌.ఎమ్‌.ఎస్‌2’, ‘ఎలోన్‌’ తదితర విజయవంతమైన చిత్రాలు చేశారు. కథనంలో భాగంగా వచ్చే మలుపులు రక్తికట్టిస్తాయి’’.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.