ఒకేరోజు రెండు లుక్కులు.. రెండు శుభవార్తలు!!

భారతీయ చిత్రసీమ మూవీ మిషన్‌ అక్షయ్‌ కుమార్‌ ఒకేరోజు రెండు శుభవార్తలు వినిపించడంతో పాటు రెండు కొత్త లుక్కులును చూపించారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా అరడజనుకు పైగా చిత్రాలు సెట్స్‌పై ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ‘బచ్చన్‌ పాండే’, ‘బెల్‌బాటమ్‌’ చిత్రాలు కూడా ఉన్నాయి. వీటిలో ఒక దానికి ఫర్హాద్‌ సామ్‌జీ దర్శకత్వం వహిస్తుండగా.. మరోదానికి రంజిత్‌ ఎమ్‌.తివారి దర్శకుడు. ఇప్పటికే ఈ రెండు చిత్రాల విడుదల తేదీలు ఖరారైపోయాయి. కానీ, తాజాగా ‘బచ్చన్‌ పాండే’ విడుదల తేదీని ఆమీర్‌ ఖాన్‌ ‘లాల్‌ సింగ్‌ చద్దా’ కోసం మార్చుకోవాల్సి రావడంతో.. అక్షయ్‌ తన మరో చిత్రం ‘బెల్‌బాటమ్‌’ను కూడా మరో కొత్త తేదీకి మార్చుకున్నారు. నిజానికి ‘బచ్చన్‌ పాండే’ను క్రిస్మస్‌కే తీసుకురావాల్సి ఉండగా.. ఇప్పుడు దాన్ని 2021 జనవరి 22కు మార్చుకున్నారు. కానీ, ఇప్పటికే ఆ తేదీన తన మరో చిత్రం ‘బెల్‌బాటమ్‌’ను తీసుకురాబోతున్నట్లు ఇది వరకే ప్రకటించారు అక్షయ్‌. కాబట్టి ఒకేరోజు తన సినిమాతో తాను పోటీ పడటం బాగోదు కాబట్టి ఇప్పుడా సినిమాను ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలియజేశారు. తాజాగా ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఓ ఆసక్తికరమైన కామెంట్‌ చేశారు. ‘‘జనవరి 22న నా సినిమాతో నేనే పోటీ పడటమంటే మీమ్స్‌ చేసుకోవడానికి నేను అవకాశమిచ్చినట్లే అవుతుంది. అందుకే ‘బెల్‌బాటమ్‌’ను 2021 ఏప్రిల్‌ 2 తీసుకురాబోతున్నాం’’ అంటూ నవ్వులు పూయించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.