జాతీయ ఉత్తమ నటుల పోటీ

జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని 2018కి దక్కించుకున్న యువ కథానాయకులు ఆయుష్మాన్‌ ఖురానా, విక్కీ కౌశల్‌. ‘అంధాధున్‌’కు ఆయుష్మాన్, ‘ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్స్‌’కు విక్కీ ఈ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ బాక్సాఫీసు వద్ద పోటీకి సిద్ధమవుతున్నారు. ఆయుష్మాన్‌ నటించిన ‘శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావధాన్‌’, విక్కీ నటిస్తున్న ‘భూత్‌: ది హాంటెడ్‌ షిప్‌’ చిత్రాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న విడుదల కానున్నాయి. ‘భూత్‌’ విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించింది చిత్రబృందం. తాజాగా ‘శుభ్‌ మంగళ్‌...’ విడుదల తేదీని కొత్త పోస్టర్‌తో ప్రకటించారు. హారర్‌ థ్రిల్లర్‌గా వస్తోన్న ‘భూత్‌’ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌లు ఆకట్టుకుంటున్నాయి. విక్కీ నటిస్తున్న తొలి హారర్‌ చిత్రమిది. ముంబయిలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ముంబయి సముద్ర తీరంలో మునిగిపోయిన ఓ ఓడ.. అందులో దెయ్యం...ఇలాంటి నేపథ్యంతో సాగే కథ అని చిత్రబృందం చెబుతోంది. భాను ప్రతాప్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో భూమి పెడ్నేకర్‌ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కరణ్‌ జోహార్‌ ఈ సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఆయుష్మాన్‌ నటించిన ‘శుభ్‌ మంగళ్‌ సావధాన్‌’ మంచి విజయం సాధించింది. ఓ లైంగిక సమస్య నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావధాన్‌’ తెరకెక్కుతోంది. ఇద్దరు గేల ప్రేమ కథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ మాట్లాడుతూ ‘‘శుభ్‌ మంగళ్‌...’ ఫ్రాంచైజీలో సమాజంలో బహిరంగంగా చెప్పుకోవడానికి భయపడే సమస్యలు ఒకొక్క దాని గురించి చర్చిస్తాం. ‘శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావధాన్‌’లో కూడా అలాంటి ఓ సమస్యనే కాస్త వినోదాన్ని జోడించి చూపిస్తున్నాం’’అన్నారు. నీనా గుప్తా, గజరాజ్‌ రావ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి హితేష్‌ కేవల్య దర్శకుడు.ఆయుష్మాన్, విక్కీ ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉన్న కథా నాయకులు. జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని పంచుకున్న ఈ ఇద్దరూ బాక్సాఫీసు వద్ద పోటీకి దిగుతుండటంతో బాలీవుడ్‌లో ఈ చిత్రాలపై ఆసక్తి మరింత పెరిగింది. ఒకరే గెలుస్తారో...లేక గెలుపును కూడా పంచుకొని బాలీవుడ్‌కు మంచి వసూళ్లు అందిస్తారో చూడాలి మరి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.