‘బ్రహ్మాస్త్రం’ వచ్చేది ఆరోజే

ప్ర
స్తుతం బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘బ్రహ్మాస్త్ర’ ఒకటి. రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్, నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు రూ.350 కోట్లకు పైగా బడ్జెట్‌తో మూడు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి తొలి భాగం గతేడాది డిసెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రావల్సి ఉంది. కానీ, చిత్రీకరణ ఆలస్యం కావడం.. గ్రాఫిక్స్‌ అత్యంత ప్రాధాన్యముండటం తదితర కారణాల వల్ల ఈ ఏడాదికి విడుదల వాయిదా పడింది. ఇప్పుడీ రిలీజ్‌ డేట్‌పై చిత్ర నిర్మాత కరణ్‌ జోహార్‌ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఈ తేదీలో ఎటువంటి మార్పు ఉండబోదని, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ చిత్రంలో కింగ్‌ నాగార్జున పురవస్తు శాస్త్రవేత్తగా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక రణ్‌బీర్‌ ప్రత్యేక శక్తులు కలిగిన ఓ సూపర్‌ హీరోగా దర్శనమివ్వబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అవెంజర్స్‌ తరహాలో ఆయనకి అగ్నితో నిండిన కొన్ని గొప్ప శక్తులుంటాయి. అవెంజర్స్‌ సిరీస్‌లో సూపర్‌ పవర్‌ సాధించడం కోసం ప్రతినాయకులు సూపర్‌ హీరోలకు మధ్య పోరాటం సాగినట్లే.. ‘బ్రహ్మాస్త్ర’ కథ సైతం అదే తరహాలో సాగనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఆ సూపర్‌ పవర్‌ను సాధించేది కూడా రణ్‌బీరేనట. అన్నట్లు ఈ యువ హీరో తన పాత్ర కోసం కలరిపయట్టు, వర్మ కలై వంటి యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.