ఇంటిపేర్లు తెచ్చిన తంటా ఏమిటి?
అక్షయ్‌ కుమార్, కరీనా కపూర్, దిల్జిత్‌ దొసాంజ్, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో నటించిన వినోదాత్మక చిత్రం ‘గుడ్‌న్యూస్‌’. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్మించారు. నూతన దర్శకుడు రాజ్‌ మెహతా తెరకెక్కించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలివీ.


వేగంగా సినిమాలు చేసే అక్షయ్‌ కుమార్‌ ఈ ఏడాదిలో ఇప్పటికే ‘కేసరి’, ‘మిషన్‌ మంగళ్‌’, ‘హౌస్‌ఫుల్‌ 4’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. ఆ మూడు చిత్రాలూ విజయవంతమయ్యాయి. ఆ ఉత్సాహంతో ఇప్పుడు ‘గూడ్‌న్యూస్‌’తో నాలుగోసారి రాబోతున్నారు. అక్షయ్‌ భార్యగా కరీనా కపూర్‌ నటించగా, దిల్జిత్‌ దొసాంజ్‌ భార్యగా కియారా అడ్వాణీ కనిపించనుంది. చాలా కాలం తర్వాత అక్షయ్, కరీనా జంటగా నటించిన చిత్రమిది. ఘన విజయాన్నందుకున్న ‘అర్జున్‌ రెడ్డి’ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’ తర్వాత కియారా నటించిన బాలీవుడ్‌ చిత్రమిది. కృత్రిమ గర్భధారణ విషయంలో ఆసుపత్రిలో జరిగిన ఓ తప్పిదం వల్ల రెండు జంటల మధ్య నెలకొన్న గందరగోళం నేపథ్యంలో ఈ చిత్రం వినోదాత్మకంగా తెరకెక్కినట్లు ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది. ప్రివ్యూ షో స్పందనను బట్టి ఈ చిత్రం నవ్వులు పంచడం ఖాయమని తెలుస్తోంది.


కథేంటి
: వరుణ్‌ బత్రా (అక్షయ్‌), దీప్తి బత్రా (కరీనా) భార్యాభర్తలు. సంతానం కలగకపోవడంతో కృత్రిమ గర్భధారణ కోసం ఓ ఆసుపత్రిని సంప్రదిస్తారు. అలాంటి సమస్యతోనే హనీ బత్రా (దిల్జిత్‌), మోనికా బత్రా (కియారా) అదే ఆసుపత్రికి వస్తారు. అయితే రెండు జంటల ఇంటి పేర్లు బత్రానే కావడంతో వైద్యులు పొరపాటుపడుతారు. వరుణ్‌ శుక్రకణాలను మోనికా అండంతో, హనీ శుక్రకణాలను దీప్తి అండంతో ఫలదీకరణ చేస్తారు. దీంతో వరుణ్‌ సంతానం మోనికా గర్భంలో, హనీ సంతానం దీప్తి గర్భంలో పెరుగుతుంటారు. ఆ విషయం తెలిశాక వైద్యులు నాలిక్కరుచుకుంటారు. సంతానం కలగబోతోందంటూ గుడ్‌న్యూస్‌ చెప్పాల్సిన సమయంలో ఈ తారుమారు విషయాన్ని నీళ్లు నములుతూ చెబుతారు. అప్పుడు ఆ రెండు జంటలు ఎలా స్పందించాయి? సరిదిద్దుకోలేని ఈ తప్పిదం వారి జీవితాల్లో ఎలాంటి కల్లోలం సృష్టించింది? ఈ సమస్య ఎలా ముగిసింది అనే అంశాలను కడుపుబ్బా నవ్వించేలా తెరకెక్కించారు.


వినోదం వెనుక విమర్శలు
: వినోదం పేరిట కృత్రిమ గర్భధారణ విధానాన్ని అపహాస్యం చేస్తూ దానిపై అపోహలు సృష్టించేలా ఈ చిత్రం ఉందంటూ కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ కర్నాటకలో ఓ సంఘం కోర్టుకెక్కింది. దీంతోపాటు ట్రైలర్‌లోని ఓ డైలాగ్‌ కొందని మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ఆన్‌లైన్‌లో కొంతమంది నిరసన గళం వినిపించారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.