హృతిక్‌ కొట్టలేనిది.. సల్మాన్‌ సాధిస్తాడా

హృతిక్‌ రోషన్‌కు తెలుగు బాక్సాఫీస్‌ వద్ద ఓ మార్కెట్‌ను క్రియేట్‌ చేసిన చిత్రం ‘క్రిష్‌’, ‘ధూమ్‌’. ఈ రెండు చిత్రాల తర్వాత పలు సందర్భాల్లో మళ్లీ ఇక్కడ సత్తా చాటే ప్రయత్నాలు చేసినప్పటికీ హృతిక్‌కు కలిసిరాలేదు. తాజాగా ‘వార్‌’ చిత్రంతో మరోసారి టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ ముందుకొచ్చినా ఈ గ్రీక్‌ గాడ్‌కు నిరాశే ఎదురైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే దక్కినప్పటికీ.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్లు కొల్లగొట్టినప్పటికీ తెలుగులో మాత్రం ఆదరణ కరవైంది. చిరంజీవి ‘సైరా’ జోరు ముందు హృతిక్‌ ‘వార్‌’ నిలవలేకపోయింది. అయితే ఇప్పుడు ఇదే తరహాలో మరో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయన ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్‌ 3’ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని తెలుగులోనూ అదే పేరుతో డబ్బింగ్‌ చేస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే అదే రోజు తెలుగులో రవితేజ ‘డిస్కోరాజా’తో, సాయిధరమ్‌ తేజ్‌ ‘ప్రతిరోజు పండగే’ చిత్రాలతో బాక్సాఫీస్‌ బరిలో నిలవబోతున్నారు. అంటే క్రిస్మస్‌కు సల్మాన్‌ ఇక్కడ ఇటు మాస్‌ రాజాతో అటు మెగా హీరోతో పోటీ పడాల్సి ఉంటుంది. కానీ, ‘దబాంగ్‌’ సిరీస్‌కు ఇక్కడ మంచి క్రేజ్‌ ఉన్నప్పటికీ సల్మాన్‌కు అంతటి స్థాయి మార్కెట్‌ లేదు. కాబట్టి అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరుకుతాయా లేదా? అన్నది అనుమానం. ఇక నటీనటుల పరంగా చూసినా ‘దబాంగ్‌ 3’లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తారలెవరూ లేరు. అయితే మెగా ఫ్యామిలీ స్నేహం, ప్రభుదేవా దర్శకత్వానికి, సల్మాన్‌ స్టార్‌డంకు ఉన్న క్రేజ్‌ కాస్త అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన తెలుగు ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో ఈ చిత్రానికి ఇక్కడ కూడా మంచి వసూళ్లు దక్కే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ క్రిస్మస్‌ రేసులో తెలుగు బాక్సాఫీస్‌ వద్ద సల్మాన్‌ సత్తా చాటుతాడో? లేదో? తెలియాలంటే డిసెంబరు 20 వరకు వేచి చూడక తప్పదు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.