డబ్బులు లేక రైలు పైకెక్కిన హృతిక్‌

వారాంతం వచ్చిందంటే చాలు.. హృతిక్‌ రోషన్‌ రైలెక్కుతాడు. టికెట్టు తీసుకోవడానికి డబ్బు లేక రైలు పైకి ఎక్కి కూర్చుంటాడు. అలా ఆరు గంటలు ప్రయాణించి వారణాసి వెళ్తుంటాడు. అంత కష్టపడి అక్కడికెళ్లేది లైబ్రరీలో కూర్చొని చదువుకోవడానికి! అక్కడి బెనారస్‌ హిందూ విశ్వ విద్యాలయం గ్రంథాలయంలో దొరికే గణిత శాస్త్రానికి సంబంధించిన విదేశీ పుస్తకాలను అధ్యయనం చేస్తుంటాడు. ఆయనకు గణితమంటే అంత ఆసక్తి. కాలక్రమంలో ఆయన తన లాంటి పేద విద్యార్థులను గణితంలో మెరికల్లా తయారు చేసేందుకు ‘సూపర్‌ 30’ పేరుతో ఓ శిక్షణ సంస్థను ప్రారంభించాడు. దాని ద్వారా దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ఆ కథేంటో తెలియాలంటే ‘సూపర్‌ 30’ చూడాల్సిందే. ప్రముఖ ఐఐటీ శిక్షకుడు ఆనంద్‌ కుమార్‌ జీవితకథతో తెరకెక్కిన చిత్రమిది. హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా నటించారు. వికాస్‌ భల్‌ తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి హృతిక్‌ లుక్‌ విడుదలైంది. యుక్త వయసు విద్యార్థిగా కనిపిస్తున్న హృతిక్‌ రైలు పైన ఎక్కి కూర్చొన్న ఆ లుక్‌ ఆకట్టుకుంటోంది. ఈ నెల 12న ఈ చిత్రం విడుదలవుతోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.