‘ఇందూ కీ జావానీ’ కోసం రెచ్చిపోతున్న కియారా!

‘కబీర్‌ సింగ్’‌, ‘గుడ్‌న్యూజ్‌’ లాంటి చిత్రాల్లో సందడి చేసిన అందాల భామ కియారా అడ్వాణి. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో ‘ఇందూ కీ జావానీ’ అనే మహిళా ప్రాధాన్యత గల చిత్రంలో నటిస్తోంది. అబీర్‌ సేన్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ‘‘హసీనా పాగల్ దీవానీ..’’ అనే వీడియో సాంగ్‌ ఒకటి విడుదలైంది. ఈ వీడియోలో కియారా తన ఆటపాటతో తెగ రెచ్చిపోయింది. ‘‘హసీనా పాగల్’’‌ పాటకి షబ్బీర్‌ అహ్మద్‌ సాహిత్యం అందించగా, మికా, ఆసీస్‌ కౌర్‌ గానంతో మికా సింగ్‌ అందించిన సంగీతం ఆకట్టుకునేలా ఉంది. ‘హసీనా పాగల్ దీవానీ’ పాటను మికా సింగ్ వ్రాసి, పాడిన పాట ‘సావన్ మెయిన్ లాగ్ గయీ ఆగ్’ అనే ఆల్బమ్‌ నుంచి తీసుకున్నారు. కామెడీ డ్రామా చిత్రంగా వస్తోన్న ‘ఇందూ కీ జవానీ’ సినిమాలో కియారా ఘజియాబాద్‌కు చెందిన ఇందూ గుప్తా అనే అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఇందులో కియారా చాలా ఉద్రేకపూరితమైన అమ్మాయిగా, డేటింగ్‌లు, ఆధునికమైన పోకడలతో కనిపించనుంది. ఆ తరువాత ఆమె చేసిన కొన్ని పొరపాట్ల వల్ల  ఏం చేసిందనేది మిగిలిన కథ. టి-సిరీస్, ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎలక్ట్రిక్ యాపిల్స్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రంలో కియారా సహనటులుగా ఆదిత్య సీల్, మల్లికా దువాలు నటించారు. కరోనా వైరస్ - లాక్‌డౌన్ లేకుంటే చిత్రం జూన్‌ 5, 2020న తెరపైకి వచ్చేది. అక్టోబర్‌ 23 లక్నోలో ప్రారంభమైన ఈ చిత్రం నవంబర్‌ 22, 2019 నాటికి షూటింగ్‌ పూర్తి చేసుకుంది. త్వరలోనే సినిమా డిజిటల్‌ వేదికగా విడుదలకు సిద్ధమైంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.