ఇక్కడ కులం సమస్య.. అక్కడ పొగ సమస్య!!

షాహిద్‌ కపూర్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కబీర్‌ సింగ్‌’. కైరా అడ్వాణీ కథానాయిక. తెలుగులో ఘన విజయం సాధించిన ‘అర్జున్‌ రెడ్డి’కి రీమేక్‌గా ఇది తెరకెక్కింది. మాతృకను తెరకెక్కించిన సందీప్‌ రెడ్డి వంగాయే రీమేక్‌కూ దర్శకత్వం వహించారు. టీ సిరీస్‌ అధినేత భూషణ్‌ కుమార్‌ నిర్మించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలివీ. షాహిద్, కైరా జంటగా నటించిన తొలి చిత్రమిది. తెలుగులో ‘భరత్‌ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నాయికగా అలరించిన కైరా బాలీవుడ్‌లో తొలిసారి పూర్తిస్థాయి నాయికగా నటించిన చిత్రమిది. షాహిద్‌కు తండ్రిగా వివేక్‌ ఒబెరాయ్‌ తండ్రి సురేష్‌ ఒబెరాయ్‌ నటించారు. మొదట ఈ చిత్రంలో కథానాయకుడిగా రణ్‌వీర్‌ సింగ్, అర్జున్‌ కపూర్‌ పేర్లు వినిపించాయి. చివరకు ఆ అవకాశం షాహిద్‌ను వరించింది. తొలుత ఈ సినిమాకు టైటిల్‌గా ‘అర్జున్‌ రెడ్డి’ అనే పెట్టాలనుకున్నారట. అయితే తర్వాత ‘కబీర్‌ సింగ్‌’ పేరును ఖరారు చేశారు. కథానాయిక పేరును మాత్రం మార్చకుండా ప్రీతి అనే పెట్టారు. ‘అర్జున్‌ రెడ్డి’లో కులం వేరన్న కారణంతో కథానాయిక తండ్రి ప్రేమను తిరస్కరిస్తాడు. అయితే రీమేక్‌లో హీరో పొగతాగే అలవాటు నచ్చక ప్రేమను తిరస్కరించేలా మార్చారట. ట్రైలర్‌ విడుదల తర్వాత ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.


కబీర్‌ సింగ్‌ పేరుతో థియేటర్లు: ఈ సినిమా ప్రచారం కోసం ఓ వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పీవీఆర్‌ మల్టీప్లెక్సుల్లో.. 15 థియేటర్లను ట్రైలర్‌ విడుదల రోజు నుంచి ‘కబీర్‌ సింగ్‌ కా థియేటర్‌’ అని పేరు మార్చేశారు. వాటి లోపలి భాగాన్ని కబీర్‌ సింగ్‌ పాత్ర స్వభావానికి తగ్గట్టు తీర్చిదిద్దారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.