కన్నతల్లి ఆవేదనను ప్రధానికి చెప్పాలని..

రాజకీయ నేపథ్యంలో ఇటీవల వచ్చిన కొన్ని చిత్రాలు వివాదాలు ఎదుర్కొన్నాయి. ఇలాంటి తరుణంలో ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రాకేష్‌ ఓం ప్రకాష్‌ మెహ్రా ‘మేరే ప్యారే ప్రైమ్‌ మినిస్టర్‌’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టైటిల్‌ని బట్టి ఇందులో ప్రధాన మంత్రి ప్రస్తావన ఉన్నా ఇది రాజకీయ చిత్రం మాత్రం కాదంటున్నారు రాకేష్‌. ఇది పూర్తిగా ఓ సామాజిక సమస్యను చర్చించే చిత్రమని చెబుతుతున్నారాయన. ‘‘పేరు వింటే రాజకీయ చిత్రం అనిపిస్తుంది కానీ ఇందులో ఏ రాజకీయ ఉద్దేశాలూ లేవు. దేశంలో జరుగుతున్న అత్యాచారాలు, వాటి పట్ల సమాజ ధోరణి, బాధితురాళ్లు ఆవేదనను ఈ చిత్రం చర్చిస్తుంద’’ని తెలిపారు రాకేష్‌. ఓ మురికివాడకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు తన తల్లి అత్యాచారానికి గురైతే తన ఆవేదనను ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు మిత్రులతో కలసి దిల్లీకి వెళ్లే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. ‘‘అత్యాచార బాధితురాళ్లకు జరగాల్సిన న్యాయం గురించి మనం ఎన్నో రకాలుగా మాట్లాడుతాం. కానీ వారి ఆవేదనను ఓ పిల్లాడి దృక్కోణంలో ఈ చిత్రంలో ఆవిష్కరించాం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే ప్రేక్షకులు పరిణతి చెందారని అర్థమవుతోంద’’న్నారు రాకేష్‌. జాతీయ పురస్కార నటి అంజలీ పాటిల్‌ నటించిన ఈ చిత్రాన్ని సహజత్వం కోసం మురికివాడల్లోనే తెరకెక్కించినట్లు తెలిపారాయన. మార్చి 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.