ఛాయ్‌వాలా.. దేశ ప్రధాని అయ్యారా??
                                   

‘మేరీకోమ్‌’, ‘సరబ్‌జిత్‌’ వంటి హిట్‌ బయోపిక్‌లతో దర్శకుడిగా బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు ఒమంగ్‌ కుమార్‌. ఇప్పుడీయన భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితకథను వెండితెరపై చూపించేందుకు సిద్ధమయ్యారు. ‘పీఎం నరేంద్ర మోదీ’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో టైటిల్‌ పాత్రలో వివేక్‌ ఒబెరాయ్‌ నటించిన సంగతి తెలిసిందే. సురేష్‌ ఒబెరాయ్, సందీప్‌ సింగ్‌ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘ఓ సాధారణ ఛాయ్‌వాలా.. ఈ దేశ ప్రధాని అవుతాడా’’ అన్న ఆసక్తికర సంభాషణలతో ట్రైలర్‌ మొదలైంది. ఇందులో మోదీ బాల్యం నుంచి మొదలు.. ఆర్‌ఆర్‌ఎస్‌ఎస్‌ వైపు ఆకర్షితులవడం, రాజకీయ ప్రస్థానంలో ఆయన ఎదుర్కొన్న ఒడుదొడుకులు అన్నింటినీ కళ్లకు కట్టేలా చూపించారు. ‘‘భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా మనం ఇంకా భారతీయులం కాలేకపోయాం’’ అనే డైలాగ్‌తో వివేక్‌ ఆకట్టుకున్నారు. ‘‘ఇప్పటిదాకా మా బలిదానాలనే చూశారు.. ఇప్పుడు మా ప్రతీకారాన్ని చూడండి’’, ‘‘ఇంకోసారి హిందుస్థాన్‌పై చెయ్యివేస్తే.. నరికేస్తా. ఇదే పాకిస్థాన్‌కు నా హెచ్చరిక’’ అంటూ ట్రైలర్లో వినిపించిన సంభాషణలు హైలెట్‌గా ఉన్నాయి. దాదాపు 23 ప్రాంతీయ భాషల్లో ఏప్రిల్‌ 5న సినిమాను విడుదల చేయబోతున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.