విదేశీ పోలీస్‌లతో వస్తోన్న రోహిత్‌శెట్టి

మాస్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా పోలీస్‌ కథలు అదిరిపోయే రీతిలో వెండితెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు రోహిత్‌ శెట్టిది అందె వేసిన చేయి. ఇప్పటికే ఆయన నుంచి వచ్చిన ‘సింగం’ సిరీస్‌ చిత్రాలు, ‘సింబా’ బాక్సాఫీస్‌ ముందు ఏ స్థాయిలో సత్తా చాటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడాయన తన సింగంను, సింబాను ‘సూర్యవంశీ’తో జట్టు కట్టించి పవర్‌ఫుల్‌ స్వదేశీ పోలీస్‌లు ఎలా ఉంటారో తెరపై చూపించేందుకు సిద్ధమయ్యారు. అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడాయన భారతీయ సినీప్రియులకు విదేశీ పోలీసుల సత్తాను కూడా చూపించేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఆయన చూపించబోతున్న విదేశీ పోలీస్‌లు మరెవరో కాదు.. ప్రముఖ హాలీవుడ్‌ నటులు విల్‌ స్మిత్, మార్టిన్‌ లారెన్స్‌. ఇప్పుడు వీళ్లిద్దరూ కథానాయకులుగా నటించిన హాలీవుడ్‌ చిత్రమే ‘బ్యాడ్‌బాయ్స్‌ లైఫ్‌’. జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్‌ భాగస్వామ్యంతో భారత్‌లో విడుదల చేయబోతున్నారు ఈ పోలీస్‌ దర్శకుడు. తాజాగా ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా తెలియజేస్తూ.. చిన్న ప్రోమోను కూడా చూపించారు. ఈ ప్రచార చిత్రంలో ‘దేశీ పోలీస్‌’ అక్షయ్, రణ్‌వీర్, అజయ్‌ దేవగణ్‌ల యాక్షన్‌ సీన్‌తో మిక్స్‌ చేసి ‘విదేశీ పోలీస్‌’ పేరుతో విల్‌ స్మిత్, మార్టిన్‌ లారెన్స్‌ల సాహసాలను చూపించిన విధానం ఆకట్టుకుంది. ఇది కూడా ‘సూర్యవంశీ’లాగే పవర్‌ఫుల్‌ పోలీస్‌ కథతో తెరకెక్కిన చిత్రమే. ఓ డ్రగ్‌ మాఫియా నేపథ్యంతో సాగుతుంది. ఈ ముఠా ఆగడాలను ఆటకట్టించే పోలీసు అధికారులుగా విల్‌స్మిత్, మార్టిన్‌ కనిపిస్తారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

View this post on Instagram

A post shared by Rohit Shetty (@itsrohitshetty) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.