విడుదల తేదీలు మార్చుకున్నారు

భారీ అంచనాలున్న సినిమాలను ఒకే రోజు విడుదల చేయడం కంటే ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేయడం మేలని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకోసం చర్చల ద్వారా సినిమాల మధ్య క్లాష్‌ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు కరణ్‌జోహార్‌ ఆ తరహా ఆలోచనే చేశారు. జాన్వీకపూర్‌ ప్రధాన పాత్రలో కరణ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘గుంజన్‌ సక్సేనా’. కార్గిల్‌ యుద్ధంలో విశేష సేవలందించిన మహిళా పైలెట్‌ గుంజన్‌ సక్సేనా జీవిత కథతో శరణ్‌ శర్మ తెరకెక్కిస్తున్నారు. మొదట ఈ సినిమాను మార్చి 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఈ సినిమా నిర్మాణానంతర పనులు ఆలస్యం కావడంతో ఏప్రిల్‌ 24న విడుదల చేస్తున్నారు. అదే రోజు రాజ్‌కుమార్‌రావ్, జాన్వీకపూర్‌ ప్రధాన పాత్రల్లో హార్దిక్‌ మెహతా తెరకెక్కిస్తున్న ‘రూహీ అఫ్జానా’ని విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు నిర్మాత దినేష్‌ విజన్‌. కరణ్‌తో తనకున్న స్నేహం దృష్ట్యా తన సినిమాని జూన్‌ 5ని విడుదల చేయడానికి అంగీకరించారు దినేష్‌. విడుదల తేదీల మార్పు విషయాన్ని ట్విటర్‌ ద్వారా ప్రకటించారు కరణ్‌. ఈ నిర్ణయం చిత్ర పరిశ్రమకు ఎంతో కలిసొచ్చే అంశమని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.