‘సర్దార్‌ ఉద్దమ్‌ సింగ్‌’ బయటకొస్తున్నాడు..

‘ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్‌’ తర్వాత విక్కీ కౌశల్‌ నుంచి రాబోతున్న మరో దేశభక్తి నేపథ్య చిత్రం ‘సర్దార్‌ ఉద్దమ్‌ సింగ్‌’. భారత విప్లవ వీరుడు సర్దార్‌ ఉద్దమ్‌ సింగ్‌ జీవితకథతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సుజీత్‌ సిర్కార్‌ తెరకెక్కిస్తున్నారు. రైజింగ్‌ సన్‌ ఫిలింస్‌ నిర్మిస్తోంది. నిన్నమొన్నటి వరకు యూరోప్‌లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం తాజాగా తుది షెడ్యూల్‌ను పూర్తి చేసుకుందట. చిత్ర బృందం ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా అభిమానులకు తెలియజేసింది. ఈ సందర్భంగా యూరోప్‌ వీధుల్లో చిత్ర బృందమంతో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. వచ్చే ఏడాది అక్టోబరు 2న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. చిత్ర కథ విషయానికొస్తే.. తెల్లవారిపై భారతీయులు స్వాతంత్య్ర పోరాటం చేస్తున్న కాలమది. ఈ నేపథ్యంలోనే 1919లో పంజాబ్‌లో జలియన్‌వాలా బాగ్‌ దుర్ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నాటి పంజాబ్‌ గవర్నర్‌ జనరల్‌ మైఖల్‌ ఓ డయ్యర్‌ శాంతియుతంగా సమావేశం ఏర్పాటు చేసుకున్న భారతీయులపై తన పోలీసులతో కాల్పులు జరిపించాడు. ఈ కాల్పుల్లో వేలాది మంది భారతీయులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అయితే దీనికి ప్రతీకారంగా నాటి విప్లవ వీరుడు ఉద్దమ్‌ సింగ్‌ ఈ ఘటనకు కారకుడైన డయ్యర్‌ను లండన్‌లో మార్చి 13, 1940లో కాల్చి చంపాడు. ఆ వెంటనే బ్రిటిష్‌ ప్రభుత్వం ఉద్దమ్‌ను అరెస్టు చేసి 1940 జులై 31న ఉరితీసింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.