వెండితెర ‘థాకరే’ వస్తున్నాడు
రాఠా రాజకీయ ఉద్ధండుడు, శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌ థాక్రే జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘థాకరే’. మరాఠీ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో థాకరే పాత్రలో నవాజుద్దీన్‌ సిద్దిఖీ నటించారు. థాక్రే సతీమణి మీనా థాక్రేగా అమృతా రావ్‌ నటించింది. అభిజిత్‌ పన్సె దర్శకత్వం వహించారు. శివసేన నేత సంజయ్‌ రావత్‌ రచయిగా వ్యవహరించడంతో పాటు నిర్మాణంలో పాలుపంచుకున్నారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆ సినిమా విశేషాలివీ.


కార్టూనిస్టుగా ప్రస్థానం మొదలుపెట్టి కాలక్రమంలో మరాఠా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన బాలా సాహెబ్‌ థాకరే జీవితాన్ని నేటి తరానికి తెలియజేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థాకరే పాత్రకు నవాజుద్దీన్‌ను ఎంచుకున్నప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. చివరి క్షణం వరకూ హిందూ జాతీయ వాదిగా జీవించిన థాకరే పాత్రకు ముస్లిం అయిన నవాజ్‌ను ఎంపిక చేసుకోవడమే అందుకు కారణం. అయితే ‘థాకరే’ ఫస్ట్‌లుక్‌ విడుదలయ్యాక నవాజ్‌ సరైన ఎంపిక అని అంతా ఒప్పుకున్నారు. థాకరే గెటప్‌లో నవాజ్‌ అంతలా ఒదిగిపోయారు. ఈ సినిమా టీజర్‌ థాకరేకు సన్నిహితుడైన అమితాబ్‌ బచ్చన్‌ చేతుల మీదుగా విడుదలైంది. అయితే ట్రైలర్‌ విడుదలయ్యాక ఈ చిత్రంపై వివాదం రాజుకుంది. అందులో దక్షిణ భారతీయులపై ద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా సంభాషణలున్నాయంటూ విమర్శలొచ్చాయి. వాటిని తొలగించాలంటూ డిమాండ్లు వచ్చాయి. కానీ చిత్ర నిర్మాత సంజయ్‌ రావత్‌ అందుకు అంగీకరించలేదు. అయితే మరాఠీ ట్రైలర్‌లో ఉన్న ఆ సంభాషణలు హిందీ ట్రైలర్‌లో వినిపించలేదు. మరాఠీ వెర్షన్‌కు నవాజుద్దీన్‌ డబ్బింగ్‌ చెప్పలేదు. ఆ భాషలో సంభాషణలు చెప్పడానికి అంత పట్టు లేదని, అందుకే డబ్బింగ్‌ చెప్పలేకపోయానని నవాజ్‌ తెలిపారు. ఇందులో ఇందిరా గాంధీ, ఉద్ధవ్‌ థాక్రే, రాజ్‌ థాక్రే పాత్రలు కూడా ఉన్నాయి. ఈ సినిమాకు సీక్వెల్‌ రూపొందించే ఆలోచన ఉన్నట్లు సంజయ్‌ రావత్‌ చెప్పారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.