ప్రియమైన ప్రధానికి ఓ బాలుడి లేఖ!

స్త్రీని దేవతగా పూజించే ఈ దేశంలోనే మహిళలపై లెక్కలేనన్ని అకృత్యాలు జరుగుతున్నాయి. రోజూ ఎంతో మంది తల్లులు, అక్కచెల్లెళ్లు అత్యాచారాలకు గురవుతున్నారు. నిత్యం అలాంటి వార్తలు చదివీ వినీ ఆ దారుణాలను ఓ మామూలు విషయంగా పరిగణించే దుస్థితి వచ్చింది. కానీ ఓ మహిళపై అత్యాచారం జరిగితే తను ఎంత క్షోభ అనుభవిస్తుంది? తన కుటుంబ సభ్యులు ఎదుర్కొనే మానసిక పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుంది అన్నది ఆ బాధను అనుభవించినవారికే తెలుస్తుంది. ఆ బాధను ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లాలనుకున్నాడు ఎనిమిదేళ్ల కన్హు. ముంబయిలోని ఓ మురికివాడలో నివసించే అతడి తల్లి కూడా అత్యాచారానికి గురైంది. కన్న తల్లి కంట కన్నీటిని చూసి ఆ చిట్టి మనసు తల్లడిల్లింది. తన తల్లికి జరిగిన అన్యాయం ఈ దేశంలో ఇంకే అమ్మకూ జరగకూడదని కోరుకున్నాడు. తన కోరికను తీర్చగలిగే శక్తి ప్రధానికే ఉందని విన్నాడు. వెంటనే ప్రధానికి ఓ లేఖ రాశాడు. మరి ఆ లేఖకు ప్రధాని స్పందించాడా? లేదా? కన్హు ప్రయత్నం ఎంతవరకూ సఫలమైంది అన్నది ‘మేరే ప్యారే ప్రైమ్‌ మినిస్టర్‌’లో చూడాలి. ప్రముఖ దర్శకుడు రాకేష్‌ ఓం ప్రకాష్‌ మెహ్రా తెరకెక్కించారు. కన్హుగా ఓం కనోజియా, అతని తల్లిగా జాతీయ పురస్కార నటి అంజలీ పాటిల్‌ నటించారు. రోమ్‌ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శితమైన తొలి ఆసియా చిత్రంగా నిలిచిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.