ఇటు గర్ల్‌ఫ్రెండ్‌.. అటు ట్రోఫీ!!

‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’.. వరుణ్‌ ధావన్, ఆలియా భట్, సిద్ధార్థ్‌ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2012లో బాక్సాఫీస్‌ ముందు భారీ విజయాన్ని అందుకొంది. ఇప్పుడీ హిట్‌ చిత్రానికి సీక్వెల్‌గా ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ను తెరకెక్కించారు పునిత్‌ మల్హోత్రా. టైగర్‌ ష్రాఫ్‌ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రంతో తారా సుతారియా, అనన్య పాండేలను నాయికలుగా బాలీవుడ్‌ తెరకు పరిచయం చేస్తున్నారు నిర్మాత కరణ్‌ జోహార్‌. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓ ప్రముఖ కళాశాలలో టైగర్, అనన్య, తార కలిసి చదువుకుంటుంటారు. చదువులో, ఆటల్లోనూ నెం.1గా నిలిచి ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ ట్రోఫీ సాధించాలనేది టైగర్‌ కల. కానీ, కళాశాలలో ఓ డబ్బున్ను విద్యార్థితో గొడవల కారణంగా.. తన లక్ష్యానికి అనేక అడ్డంకులు ఎదురవుతాయి. ఈ క్రమంలోనే టైగర్‌ను కళాశాల నుంచి బయటకు పంపేస్తారు. కానీ, తాను అనుకున్నది సాధించడం కోసం టైగర్‌ ఆ కాలేజిలోకి తిరిగి ప్రవేశిస్తాడు. ఈ మధ్యలో ఓ చిన్న ప్రేమకథ. మరి చివరికి ఏం జరిగింది. టైగర్‌ స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ట్రోఫీని గెలుచుకుంటాడా? తార, అనన్యల్లో ఎవరిని ప్రేమించాడు? చివరికి ఏమైంది? అన్న నేపథ్యంతో కథ సాగబోతుంది. టైగర్‌ ష్రాఫ్‌ కాలేజి కుర్రాడిగా స్టైలిష్‌లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. యాక్షన్‌ సన్నివేశాల్లో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. తొలి చిత్రమే అయినా తారా, అనన్యల అభినయం ఆకట్టుకునేలా ఉంది. లుక్స్‌ పరంగా చాలా ఫ్రెష్‌గా కనిపించారు. ‘‘ఒక చేతిలో గర్ల్‌ఫ్రెండ్‌.. మరో చేతిలో ట్రోఫీ.. గెలిచితీరుతాను’’ అంటూ ట్రైలర్‌లో టైగర్‌ చెప్పిన డైలాగ్‌ హైలెట్‌గా ఉంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.