అప్పడాలు అమ్మే మాష్టారు.. అద్భుతాలు సృష్టించిన వేళ!
బాలీవుడ్‌ నుంచి మరో జీవిత కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రమే ‘సూపర్‌ 30’. ప్రముఖ ఐఐటీ శిక్షకుడు ఆనంద్‌ కుమార్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ‘క్వీన్‌’ దర్శకుడు వికాస్‌ భల్‌ తెరకెక్కించారు. శుక్రవారం ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆ సినిమా విశేషాలివీ.


హృ
తిక్‌ రోషన్‌ తెరపై కనిపించి రెండున్నరేళ్లు కావస్తోంది. 2017 జనవరిలో వచ్చిన ‘కాబిల్‌’ తర్వాత ఆయన వ్యక్తిగత కారణాల వల్ల విరామం తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ‘సూపర్‌ 30’తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. అందుకే ఈ చిత్రం కోసం ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

* కథేంటి..

బిహార్‌లోని ఓ పేద కుటుంబంలో పుట్టిన ఆనంద్‌ కుమార్‌.. ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో సీటు దక్కించుకునే స్థాయికి ఎదుగుతాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల అక్కడ చేరలేకపోతాడు. సొంత ఊరిలోనే ట్యూషన్లు చెబుతూ బతుకు తెరువు కోసం అప్పడాలు అమ్ముతాడు. గణితంలో అపారమైన ప్రజ్ఞ ఉన్న ఆనంద్‌ కుమార్‌ రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు ప్రతిష్ఠాత్మకమైన జర్నల్స్‌లో ప్రచురితమైతాయి. ఆ తర్వాత ఆయన తన లాంటి పేద విద్యార్థులకు ఐఐటీలో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ‘సూపర్‌ 30’ కోర్సును ప్రారంభిస్తాడు. గణితమంటే గ్రామీణ విద్యార్థుల్లో ఉండే భయాన్ని పటాపంచలు చేసేలా వినూత్నమైన బోధనా విధానంతో వారిని మెరికల్లా తయారు చేస్తాడు. ఏటా ఆయన వద్ద శిక్షణ తీసుకున్న వారు ఐఐటీల్లో జయకేతనం ఎగురవేస్తుంటారు. దీంతో ఆనంద్‌ కుమార్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది. ఆయన్ను ఎన్నో పురస్కారాలు వరిస్తాయి. టైమ్స్‌ మేగజైన్‌ జాబితాలోనూ ఆయన స్థానం సంపాదించుకుంటారు. ఆ కథనే స్ఫూర్తిరగిలించేలా తెరపై ఆవిష్కరించినట్లు చిత్రబృందం చెబుతోంది.



*
హృతిక్‌ తన పాత్ర కోసం బిహారీ యాసను నేర్చుకున్నారు. అందుకోసం ఓ శిక్షకుణ్ని నియమించుకున్నారు.

* ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉండగా దర్శకుడు వికాస్‌ భల్‌ ‘మీటూ’ ఆరోపణల్లో చిక్కుకున్నారు. ‘క్వీన్‌’ సమయంలో వికాస్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆ సినిమా కథానాయిక కంగనా రనౌత్‌ ఆరోపించింది. దీంతో ‘సూపర్‌ 30’ దర్శకుడిగా వికాస్‌ పేరును తొలగించాలని చిత్రబృందం నిర్ణయించింది. అయితే ఆ తర్వాత వికాస్‌కు ఆ వివాదంలో క్లీన్‌ చిట్‌ లభించడంతో ఆయన్నే దర్శకుడిగా కొనసాగించారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.