‘మోదీ’కి సుప్రీంలో ఊరట

భారత ప్రధాన మంత్రి మోదీ జీవిత కథతో తెరకెక్కిన ‘పీఎం నరేంద్ర మోదీ’కి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ బయోపిక్‌ను విడుదల చేయడానికి వీల్లేదంటూ విపక్షాలు సుప్రీంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీం తాజాగా తన తీర్పును వెలువరించింది. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు నుంచి సర్టిఫికెట్‌ రానందున విడుదలను వాయిదా వేయలేమని చెప్పింది. అయినా సెన్సార్‌ పరిశీలనకే వెళ్లని చిత్రంపై ముందస్తు వ్యాజ్యం దాఖలు చేయడమేంటని పిటీషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మూవీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందా? లేదా? అన్నది కేంద్ర ఎన్నికల కమిషన్‌ చూసుకుంటుందని తెలిపింది. ప్రస్తుతం సుప్రీం తీర్పు నేపథ్యంలో సెన్సార్‌ బోర్డు నుంచి సర్టిఫికెట్‌ వస్తే ఈ నెల 11నే థియేటర్లలోకి రానుంది మోదీ బయోపిక్‌. ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో.. మోదీ పాత్రను ప్రముఖ బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ పోషించారు. Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.