‘తానాజీ’ కోసం ఓ లోయనే తవ్వారుగా..

ఇటీవల కాలంలో సినిమాల్లో కళా దర్శకుల సెట్స్‌కు ప్రాముఖ్యత ఎంత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘బాహుబలి’ కోసం సృష్టించిన మాహిష్మతి సామ్రాజ్యం నుంచి మొదలు.. ఇప్పుడు రాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’లోని కొండారెడ్డి బురుజు వరకు ఎన్నో సెట్లు ఆయా చిత్రాలకు మరింత ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు సెట్లు అంటే భారీ భవంతులు, గొప్ప గొప్ప సామ్రాజ్యాలు, కోటలనే చూశారు సినీప్రియులు. కానీ, ఇప్పుడొక భారీ లోయను కూడా సెట్‌ రూపంలో తెరపై చూపించే ప్రయత్నం చేసింది ‘తానాజీ: ది అన్‌ సంగ్‌ వారియర్‌’ చిత్ర బృందం. అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సైన్యాధ్యక్షుడు తానాజీ మలుసరే జీవితాధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జనవరి 10న విడుదలవుతోంది. ఇప్పుడీ సినిమా కోసమే సందన్‌ లోయను సెట్స్‌ రూపంలో పునః సృష్టించింది చిత్ర బృందం. దక్షిణ భారతదేశ రాజధానిగా కొందనా కోట ప్రాంతాన్ని ఔరంగజేబు ఎంచుకుంటారు. ఈ నేపథ్యంలో ఆ కోట ప్రాంతాన్ని కాపాడి దక్షిణ భారతదేశం మొఘలుల చేతుల్లోకుండా చూడాలని శివాజీ ఆదేశిస్తాడు. ఈ నేపథ్యంలో తానాజీ వారిపై ఎలా పోరాడాడు. ఈ క్రమంలో ఆయనకి ఎదురైన సవాü™్లంటన్నది మిగిలిన చిత్ర కథ. అజయ్‌ సందన్‌ లోయ మేకింగ్‌ వీడియోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ... ‘‘ఈ లోయను పున: సృష్టించడం చాలా కష్టమైంది. కానీ, మా చిత్ర బృందం ఎలా కష్టపడిందో ఈ వీడియోలో చూడండి’’ అని పేర్కొన్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.