చరిత్రలోనే తొలిసారిగా.. 20,000 కోట్ల క్లబ్‌లోకి!!

‘బాహుబలి’, ‘దంగల్‌’ చిత్రాలు రూ.2000 కోట్ల వసూళ్లు సాధిస్తే.. అమ్మో అంతా అంటూ నోరెళ్ల బెట్టేశారు సినీప్రియులు. హాలీవుడ్‌ చిత్రాల స్థాయికి ఇదంత పెద్ద విషయం కానప్పటికీ భారతీయ చిత్రసీమకు ఇవి చాలా.. పెద్ద మొత్తమే అని చెప్పాలి. ఇక హాలీవుడ్‌ విషయానికొస్తే.. రూ.18,800 కోట్లన్నది (2.7 బిలియన్‌ డాలర్లు) రికార్డు కలెక్షన్‌. ప్రపంచ సినీ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో వసూళ్లు సాధించిన ఏకైక చిత్రంగా ‘అవతార్‌’ పేరిట రికార్డు ఉంది. కానీ, ఇప్పుడీ రికార్డును రూ.20,000 కోట్ల (3 బిలియన్‌ డాలర్లు) వసూళ్లతో తిరగరాయబోతుందట ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’. అదేంటి ఇంకా ఈ సినిమానే బయటకు రాలేదు కదా.. అప్పుడే ఈ వసూళ్ల లెక్కలేంటని ఆశ్చర్యపోకండి. ఇది ప్రపంచ సినీ పండితులు అంచనాల ఆధారంగా కట్టిన లెక్కలు. వీరంతా కలిసి ఘంటాపథంగా చెప్తున్న విషయం ఒక్కటే అవతార్‌ పేరిట ఉన్న అత్యధిక వసూళ్ల (2.7 బిలియన్‌ డాలర్ల) రికార్డును ‘ఎండ్‌గేమ్‌’ 3 బిలియన్‌ డాలర్ల కలెక్షన్స్‌తో తిరగరాయబోతుందని. అవెంజర్స్‌ సిరీస్‌ నుంచి వస్తోన్న ఈ ఆఖరి చిత్రం ఏప్రిల్‌ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. భారత్‌లో హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో రిలీజ్‌ అవబోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్ర అడ్వాన్స్‌ బుకింగ్స్‌ను షురూ చేశారు. అయితే ఇలా బుకింగ్‌ మొదలుపెట్టారో లేదో.. కొద్ది గంటల్లోనే వారంకు పైగా టికెట్లు కొనుగోలు చేసేశారు సినీప్రియులు. ఇప్పుడీ అడ్వాన్స్‌ బుకింగ్స్‌తోనే చిత్ర బృందానికి వేల కోట్ల రూపాయలు వెనక్కు వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడీ జోరు చూస్తుంటే రూ.20,000 కోట్ల వసూళ్లన్నవి ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’కు పెద్ద విషయమే కాదనిపిస్తోంది. ఈ సినిమాకు భారత్‌లోనూ మంచి ఆదరణ లభిస్తోంది. ఇక్కడ ఆమీర్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్, ఏఆర్‌ రెహమాన్, రానా వంటి సినీ ప్రముఖులు ‘ఎండ్‌ గేమ్‌’ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘ఇన్ఫినిటీ వార్‌’ సినిమా చివర్లో కొంతమంది అవెంజర్స్‌ మాయమవుతూ కనిపించారు. ఇలా మాయమైన వారంతా ఏమయ్యారు? ఎక్కడికి వెళ్లారు? ప్రపంచాన్ని అంతం చేసి, తన సామ్రాజ్యాన్ని స్థాపించుకోవాలనుకుంటున్న థానోస్‌ ఏం చేయబోతున్నాడు? దీన్ని అవెంజర్స్‌ ఎలా అడ్డుకుంటారు? వంటి ఆసక్తికర అంశాలతో ‘ఎండ్‌ గేమ్‌’ను తెరకెక్కించారు. ప్రముఖ దర్శకులు జాయ్‌ రుస్సో, ఆంటోని రుస్సో సంయుక్తంగా దీన్ని రూపొందించారు.

సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.