ఓవైపు వరద నీళ్లు.. మరోవైపు మొసళ్లు!!

విభిన్న జంతు జాతుల కథలతో ఉత్కంఠ రేకెత్తించేలా చిత్రాలను తెరకెక్కించి, సినీ ప్రియులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేయడంలో హాలీవుడ్‌ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఈ క్రమంలోనే నాటి ‘కింగ్‌కాంగ్‌’ నుంచి నేటి ‘జురాసిక్‌ పార్క్‌’ వరకు అనేక రకాల జంతు నేపథ్య కథలను వెండితెరపై దర్శించి మురిసిపోయాం. ఇప్పుడు తాజాగా ఓ మొసళ్ల సినిమా సినీ ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసేందుకు ముస్తాబవుతోంది. అదే అలెగ్జాండ్రి అజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్రాల్‌’ చిత్రం. పారామౌంట్‌ పిక్చర్స్‌ సమర్పణలో.. క్రెయిగ్‌ జె ఫ్లోరిస్, శామ్‌ రైమీలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. తాజాగా ట్రైలర్‌ విడుదలైంది. కథ విషయానికొస్తే.. అది అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం. ఉన్నట్టుండి ఆ రాష్ట్రంపై హరికేన్‌లు విరుచుకుపడటంతో.. వర్షాలు, వరదలు పోటెత్తి ఆ ప్రాంతమంతా అతలాకుతలం అయిపోతుంది. దీంతో అక్కడి వారంతా ప్రాణాలు కాపాడుకోవడానికి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతారు. కానీ, ఓ మహిళ మాత్రం తన ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతుంది. ఇదే సమయంలో వరదల ధాటికి కొట్టుకొచ్చిన కొన్ని మొసళ్లు ఆమె ఉండే ప్రాంతంలోకి ప్రవేశిస్తాయి. ఈ నేపథ్యంలో వాటి బారి నుంచి ఆమె తన ప్రాణాలు ఎలా కాపాడుకోగలిగింది? ఆమెను కాపాడటానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ నేపథ్యంలో ఎంత మంది తమ ప్రాణాలు కోల్పోవల్సి వచ్చింది? తదితర అంశాలతో ఉత్కంఠభరితంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం జులై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.