‘మోగ్లీ’ కోసం.. బాలీవుడ్‌ గొంతులు!

జంతు ప్రపంచం...మానవ సమూహం...మధ్యలో అడవిలో పెరిగిన ఓ బాలుడు....ఇలా సాగే ఓ కథ. అందులో జంతువులు మాట్లాడుతుంటాయి. బాలుణ్ని ప్రేమగా చూసుకుంటాయి. ఇలాంటి నేపథ్యంతో తెరకెక్కుతోన్న హాలీవుడ్‌ చిత్రం ‘మోగ్లీ: ది లెజెండ్‌ ఆఫ్‌ జంగిల్‌’. ఈ చిత్రాన్ని హిందీలోనూ విడుదల చేస్తున్నారు. జంతువులు మాట్లాడటం అనేది ఇందులో చాలా ఆసక్తికరం అంశం. అందుకే ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న నెట్‌ప్లిక్స్‌ సంస్థ జంతువులకు సినీతారలతో డబ్బింగ్‌ చెప్పించింది. ఎవరో తెలియని వాళ్లతో డబ్బింగ్‌ చెబితే కిక్‌ ఉండదు. స్టార్‌ నటులు వాయిస్‌ అయితే అదిరిపోతుందని భావించింది. అందుకే ఈ చిత్రంలోని కీలకమైన జంతు పాత్రలైన బాలు, భగీరా, నిషా, కా, షేర్‌ ఖాన్‌ల కోసం హిందీ తారలు గొంతిచ్చారు. ఈ చిత్రంలో మోగ్లీగా రోహన్‌ చంద్‌ నటిస్తున్నాడు ఆండ్రూ సెర్కిస్‌ దర్శకత్వం వహించారు. రుడ్‌ యార్డ్‌ కిప్లింగ్‌ రాసిన ‘ఆల్‌ ది మోగ్లీ స్టోరీస్‌’ ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం వచ్చే నెల 7న విడుదల కానుంది.ఎలుగుబంటి: అనిల్‌కపూర్‌


ఈ చిత్రంలోని బాలూ పేరుతో సాగే ఎలుగుబంటి పాత్రకు అనిల్‌కపూర్‌ గొంతు ఇచ్చారు. ‘‘ఈ చిత్రంలో ఎలుగుబంటి పాత్రకు గొంతు ఇవ్వడం బాగుంది. బాలూ పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తా’’అని సోషల్‌ మీడియాలో పంచుకొన్నారు అనిల్‌. దీనిపై సోషల్‌ మీడియాలో జోకులు బాగానే పేలాయి. ‘‘ఓ ఎలుగుబంటి పాత్రకు అనిల్‌కపూర్‌ సార్‌ అయితే ఇబ్బంది ఉండదు. పైగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ అవసరం కూడా ఉండదు. ఎందుకంటే అనిల్‌సార్‌కు జట్టు పుష్కలంగా ఉంటుంది కదా’’అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.నల్ల చిరుత: అభిషేక్‌ బచ్చన్‌


ఇందులో భగీరా అనే ఓ నల్ల చిరుత పాత్ర కీలకమైంది. దానికి అభిషేక్‌ బచ్చన్‌ గొంతు అరువిచ్చారు. ‘‘నా జీవితంలో నాకెంతో నచ్చిన ఓ కథలో భాగం అవుతున్నందుకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. నా గొంతుని థియేటర్లో వినడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’అని ట్వీటారు అభిషేక్‌.తోడేలు: మాధురీ దీక్షిత్‌మోగ్లీలో మరో కీలకమైన పాత్ర నిషా అనే ఆడ తోడేలుది. తన భర్తకు అడవిలో దొరికిన పిల్లాడికి కూడా తన పిల్లలతో పాలు పాలిచ్చి మాతృత్వపు గొప్పదనం చాటుతుంది. ఆ పిల్లాడికి మోగ్లీ అనే పేరు పెడుతుంది. ఇప్పుడు ఆ పాత్రకు బాలీవుడ్‌ తార మాధురీ దీక్షిత్‌ గొంతు వినబోతున్నాం. ‘నిషా ఓ గొప్ప పాత్రకు వాయిస్‌ ఇవ్వడం చాలా బాగుంది’’అని ట్వీట్‌ చేశారు మాధురి.పులి: టైగర్‌ ష్రాప్‌


తన పేరుకు తగ్గట్టే ఈ చిత్రంలోని పులి పాత్ర షేర్‌ఖాన్‌కు గొంతు అరువు ఇచ్చారు బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాప్‌. ‘‘షేర్‌ఖాన్‌ పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం గర్వంగా ఉంద’’ని ట్వీటారు టైగర్‌.కొండచిలువ: కరీనాకపూర్‌మోగ్లీకి అత్యంత సన్నిహితమైన మిత్రుల్లో ఒకటి కా అనే కొండ చిలువ. ఆ పాత్రలో అందాల తార కరీనాకపూర్‌ గొంతు వినబోతున్నారు ప్రేక్షకులు.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.