ఇండియాకు ముందుగానే సాలీడు మనిషి
స్పైడర్‌ మ్యాన్‌ చిత్రాల అభిమానుల్ని అలరించడానికి మరో కొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది మార్వెల్‌ స్టూడియోస్‌. 2017లో వచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: హోమ్‌కమింగ్‌’కు సీక్వెల్‌గా ‘స్పైడర్‌మ్యాన్‌: ఫార్‌ ఫ్రమ్‌ హోమ్‌’ తెరకెక్కింది. టామ్‌ హోలాండ్‌ ‘స్పైడర్‌మ్యాన్‌’గా నటిస్తున్న ఈ చిత్రం మన దేశంలో ఒక్కరోజు ముందే విడుదల కానుంది. ముందుగా వచ్చే నెల 5న ఈ చిత్రాన్ని విడుదల చేయలనుకున్నారు. కానీ ఈ సినిమా ట్రైలర్‌ విడుదలయ్యాక అభిమానుల నుంచి వస్తోన్న స్పందనతో 4నే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘‘మనదేశంలో ఎంతో అభిమానించే సూపర్‌ హీరో ‘స్పైడర్‌మ్యాన్‌’. ‘స్పైడర్‌మ్యాన్‌: ఫార్‌ ఫ్రమ్‌ హోమ్‌’ ట్రైలర్‌ విడుదలయ్యాక సినిమాపై క్రేజ్‌ మరింత పెరిగిపోయింది. అందుకే అభిమానుల కోసం వచ్చే నెల 4నే ఇంగ్లిష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నాం. ఈ నెల 30 నుంచే అడ్వాన్స్‌ బుకింగ్‌లు మొదలుకానున్నాయి’’ అని సోనీ పిక్చర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండియా ప్రతినిధి తెలిపారు. జాన్‌ వాట్స్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో శామ్యూల్‌ ఎల్‌ జాక్సన్, జెన్‌డయా, కోబీస్మల్డర్స్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.