బెలూన్‌లో దాక్కొని.. ప్రపంచాన్ని చుట్టేసే ఫకీర్‌
భారతీయ నటులు హాలీవుడ్‌ చిత్రాల్లో మెరవడం కొత్త కాదు. కానీ ఓ దక్షిణాది నటుడు ఓ విదేశీ చిత్రంలో కథానాయకుడిగా నటించడం, విడుదలకు ముందే ఆ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతుండటం మాత్రం భారతీయులకు గర్వకారణమే. ధనుష్‌ కథానాయకుడిగా ఇంగ్లిష్, ఫ్రెంచ్‌ భాషల్లో రూపొందిన ఆ చిత్రమే ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌’. కెనడియన్‌ దర్శకుడు కెన్‌ స్కాట్‌ తెరకెక్కించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా ఆ విశేషాలివీ.


ఫ్రెంచ్‌ రచయిత రొమైన్‌ ప్యుర్టొలస్‌ రాసిన ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌ హు గాట్‌ ట్రాప్డ్‌ ఇన్‌ ఐకియా వార్డ్‌ రోబ్‌’ నవల లక్షల కాపీలు అమ్ముడుపోయి సంచలనం సృష్టించింది. ఆ నవల ఆధారంగానే ఈ చిత్రం తెరకెక్కింది. ఆస్కార్‌ నామినేషన్లు అందుకున్న బెర్నిస్‌ బెజొ, బర్ఖత్‌ అబ్ది లాంటి ప్రముఖ నటులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్‌ సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది నేపథ్య సంగీతం అందించడంతో పాటు ‘మదారి..’ అనే పాటకు స్వరాలిచ్చారు. ఆ పాట ఇప్పటికే అమెరికా, కెనడాల్లో పాపులర్‌ అయింది. భారత్‌ సహా బ్రుస్సెల్స్, పారిస్, రోమ్‌లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. కామెడీ అడ్వంచెరస్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ‘పక్కిరి’ పేరుతో విడుదలవుతోంది.

ప్రశంసలు.. పురస్కారాలు..
అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఈ చిత్రానికి అనూహ్య స్పందన వచ్చింది. నార్వే, బార్సెలోనా చిత్రోత్సవాల్లో ‘రే ఆఫ్‌ సన్‌షైన్‌’, బెస్ట్‌ కామెడీ ఫిలిం పురస్కారాలు గెలుచుకుంది. స్పెయిన్, కెనడా తదితర దేశాల్లో ప్రీమియర్‌ షోలు వీక్షించినవారు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాను ఆస్కార్‌ బరిలో నిలిపేందుకు చిత్రబృందం సన్నద్ధమవుతోంది.


* కథేంటి..

ముంబయి వీధుల్లో మ్యాజిక్‌లు చేసుకుంటూ జీవిస్తుంటాడు అజాత శత్రు ఉరఫ్‌ అజా (ధనుష్‌). హఠాత్తుగా ఓ రోజు అతని తల్లి మరణించడంతో పారిస్‌లో ఉన్న తండ్రిని వెతుక్కుంటూ బయల్దేరుతాడు. అయితే అతని ప్రయాణం రకరకాల మలుపులు తిరుగుతుంది. వార్డ్‌ రోబ్, సూట్‌ కేస్, ఎయిర్‌ బెలూన్‌లలో దాక్కొని ఇంగ్లాండ్, రోమ్, ఇటలీ, లిబియా లాంటి దేశాలు చుట్టేస్తాడు. మధ్యలో అతనికి సూడాన్‌కు చెందిన విరాజ్, పారిస్‌ యువతి మేరీ పరిచయమవుతారు. వారితో కలసి అతని ప్రయాణం ఎలా సాగిందన్నది వినోదాత్మకంగా తెరకెక్కించారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.