గుమ్మడికాయ కొట్టేసేది అప్పుడే

సం
క్రాంతి పండక్కి మరికొద్ది రోజుల సమయమే మిగిలి ఉండటంతో ‘అల.. వైకుంఠపురములో’ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారట త్రివిక్రమ్‌. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ వంటి హిట్ల తర్వాత మాటల మాంత్రికుడితో అల్లు అర్జున్‌ చేస్తోన్న మూడో చిత్రమిది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. సుశాంత్, నవదీప్, టబు, నివేదా పేతురాజ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు ఇది వరకు ప్రకటించారు. అందుకే దీనికి తగ్గట్లుగానే చిత్రీకరణను వేగవంతం చేశారట గురూజీ. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పారిస్‌లో జరుగుతోందట. అక్కడి అందమైన లొకేషన్లలో బన్ని - పూజాలపై ‘‘సామజవరగమన’’ పాటను చిత్రీకరిస్తున్నారట. ఇప్పటికే ఈ షెడ్యూల్‌ తుది దశకు చేరుకుందని, పారిస్‌ నుంచి చిత్ర బృందం తిరిగి రాగానే హైదరాబాద్‌లో కాస్త ప్యాచ్‌ వర్క్‌ ముగించుకోని చిత్రీకరణకు గుమ్మడికాయ కొట్టేయాలని త్రివిక్రమ్‌ నిర్ణయించుకున్నారట. దాదాపు ఈ నెల చివరి కల్లా ఈ పనులు పూర్తి కానున్నాయట. ఇక డిసెంబరు నుంచి నిర్మాణాంతర కార్యక్రమాలు చూసుకుంటూనే ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించాలని ప్రణాళికలు రచిస్తున్నారట.


* పోస్టర్‌పై తేదీ అందుకే వెయ్యలేదా?
ఈ ముగ్గుల పండక్కి ‘అల.. వైకుంఠపురములో’, మహేష్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు జనవరి 12నే రాబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందాలు ప్రకటించేశాయి. అయితే దీనివల్ల ఇరు చిత్ర నిర్మాతలు నష్టపోయే ప్రమాదం ఉండటంతో తేదీ మార్పు విషయంలో ఇరు చిత్ర బృందాలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రసీమలో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం.. బన్ని చెప్పిన తేదీకి ఓ రోజు ముందు అంటే జనవరి 11న రానుండగా, మహేష్‌ ఓ రోజు తర్వాత జనవరి 13న రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఈ తేదీ మార్పు ఖాయమని తెలుస్తోంది. అందుకే దీన్ని దృష్టిలో ఉంచుకునే తాజాగా ‘అల.. వైకుంఠపురములో’ నుంచి వచ్చిన కొత్త పోస్టర్‌పై విడుదల తేదీని ముద్రించలేదని తెలుస్తోంది. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజం అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.