‘నిశ్శబ్దం’గా అమెజాన్‌ ప్రైమ్‌లోకి??

అనుష్క బహుభాషా చిత్రం ‘నిశ్శబ్దం’ సైలెంట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫాంలపై దర్శనమివ్వబోతుందా? ఇప్పటికే ఈ చిత్ర విడుదల హక్కులు ఓ ప్రముఖ డిజిటల్‌ ప్లాట్‌ఫాం చేతుల్లోకి వెళ్లిపోయాయా? అవుననే అంటున్నాయి చిత్ర సీమ వర్గాలు. ఈ సినిమాను నేరుగా థియేటర్లలోనే విడుదల చేస్తాం అని ఇప్పటికే ఈ చిత్ర బృందం అధికారిక ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే. కానీ, మరోవైపు దీన్ని ఓటీటీ నుంచి విడుదల చేయడానికి తెర వెనుక అన్ని ఒప్పందాలు జరిగిపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈ చిత్ర హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకుందని, ఇందుకోసం దాదాపు రూ.30కోట్ల మొత్తాన్ని వెచ్చించినట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు మాత్రం ఈ డీల్‌ ఇంకా చర్చల దశలో ఉందని, దీన్ని ఓటీటీ నుంచి విడుదల చెయ్యాల వద్దా అన్నది చిత్ర బృందం ఇంకా తేల్చుకోలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడక తప్పదు. అనుష్క - మాధవన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. హేమంత్‌ మధుకర్‌ తెరకెక్కించారు. కోన వెంకట్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీస్‌ సంయుక్తంగా నిర్మించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.