వాళ్లు కాదన్నా.. మళ్లీ అదే జరుగుతోందా?

మిగతా రంగాలతో పోల్చితే చిత్ర పరిశ్రమకు కరోనా దెబ్బ కాస్త గట్గిగానే తగిలింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిగతా రంగాలతో పోల్చితే చిత్ర పరిశ్రమ కోలుకోవడానికి చాలా సమయమే పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలకు సిద్ధమైన చిత్రాలకు నిర్మాణ భారం రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే పలు చిన్న సినిమాల నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ఫాంల వైపు దృష్టి సారిస్తున్నారు. పెద్దగా లాభాలు రాకున్నా.. పెట్టుబడి వెనక్కొస్తే చాలనుకుంటూ ఆశించిన రేటు దొరికితే ఓటీటీ నుంచి విడుదల చేసేస్తున్నారు. అయితే ఇప్పటికే చిత్రీకరన పూర్తయిన వాటిలో ‘నిశ్శబ్దం’, ‘అరణ్య’, ‘రెడ్‌’ వంటి బడా చిత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడీ చిత్రాలనీ వలలో వేసుకునేందుక ఓటీటీ సంస్థలు గట్టిగానే బేరసారాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ మూడు చిత్ర బృందాలు ‘థియేటర్లలోనే విడుదల’ అంటూ ఓ స్పష్టమైన ప్రకటనను ఇచ్చేశాయి. అయితే ‘నిశ్శబ్దం’ విడుదల విషయంలో ఇంకా ఊహాగానాలు వెలువడుతూనే ఉన్నాయి. దీనికి తగ్గట్లుగానే తాజాగా ఆ చిత్ర దర్శకుడు హేమంత్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు.. ఈ చిత్రం ఓటీటీ వైపు పోతుందనే సంకేతాలను అందించాయి. తాజాగా దీనిపై ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మాకు ఓటీటీ ఆఫర్లు వచ్చిన మాట వాస్తవమే.. కానీ, చిత్ర బృందం థియేటర్లో విడుదల చెయ్యడానికే ఆసక్తి చూపించింది. తెలుగు వెర్షన్‌కు సంబంధించి అన్ని పనులూ పూర్తయ్యాయి. కానీ, తమిళ, మలయాళ, హిందీ వెర్షన్లకు సంబంధించిన పనులు మిగిలే ఉన్నాయి. అవన్నీ అయ్యాక ఈ సినిమా విడుదల విషయంలో పునరాలోచిస్తాం. లాక్‌డౌన్‌ ఎంత కాలం ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. ఆయా పరిస్థితుల్ని బట్టి తమ చిత్రాల్ని థియేటర్లలో ఆడించాలా? ఓటీటీలోకి తీసుకురావాలా? అన్నది దర్శక నిర్మాతలు ఆలోచిస్తారు. మెజార్టీ ఓటీటీ వైపు మొగ్గు చూపితే.. మేమూ ఆ మార్గాన్నే అనుసరిస్తాం’’ అన్నారు. మొత్తానికి హేమంత్‌ మాటల్ని బట్టీ చూస్తుంటే ‘నిశ్శబ్దం’ నేరుగా ఓటీటీ తెరలపై సందడి చేసినా ఆశ్చర్యపోనవసరం లేదేమో. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కోన వెంకట్‌ నిర్మించారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.