ఆయన జీవితమే.. ‘అరణ్య’కు స్ఫూర్తి

‘‘అరణ్య’ ఓ వ్యక్తి నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం. దీనికోసం రెండేళ్లు కష్టపడ్డా. ఈ ప్రయాణంలో నన్ను నేను తెలుసుకోగలిగా’’ అంటున్నారు రానా. ఆయన కథానాయకుడి నటించిన ఈ త్రిభాషా చిత్రాన్ని ప్రభు సాల్మన్‌ తెరకెక్కించారు. విష్ణు విశాల్‌, శ్రియ కీలక పాత్రలు పోషించారు. వేసవి కానుకగా ఏప్రిల్‌ 2న థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రానా.. ఈ చిత్ర కథకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ‘‘అస్సాంలో జరిగిన ఓ వ్యక్తి నిజ జీవితం ఆధారాంగా ‘అరణ్య’ను రూపొందించారు. ఆయన పేరు జాదవ్‌ ప్రియాంక్‌. పద్మశ్రీ అవార్డు అందుకొన్న ఆయన తన జీవిత కాలంలో దాదాపు 1300 ఏకరాల అడవిని నాటాడు. బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతంలో ఆయన చేసిన ఈ పని వల్ల అక్కడి భూమి నది కోత నుంచి పరిరక్షించబడింది. జంతువులు ఉండే ప్రాంతాలను, ప్రకృతిని మనం మార్చాలని అనుకున్నప్పుడు వాటికేం ప్రమాదం ఉండదు. మనమే నష్టపోతాం. నేను పదేళ్లకు పైగా సినిమాల్లో నటించా. ఈ చిత్రం కోసం పని చేసిన రెండేళ్లలో చాలా విషయాలు నేర్చుకున్నా. జీవితం విలువ తెలిసింది. ఈ కథ విని ఆ పాత్రను అర్థం చేసుకోవడానికి నాకు ఆరు నెలల సమయం పట్టింది. థాయ్‌లాండ్‌ అడవుల్లో చిత్రీకరణ జరిపే సమయంలో చాలా రోజుల పాటు నేనొక్కడినే నటించాల్సి వచ్చేది. కో యాక్టర్‌ ఎవరూ లేరు. మొబైల్స్‌ కూడా పనిచేసేవి కావు. దీంతో నేనెవరు? నేనేంటి? అన్న విషయాలు తెలుసుకున్నా. ఈ చిత్రాన్ని మూడు భాషల్లో చేయడం చాలా కష్టంగా అనిపించింది. తెలుగు, తమిళ్‌లో సులభంగా చేశా కానీ, హిందీలో మరింత కష్టంగా అనిపించింది. పర్యావరణంలో మనం ఒక భాగమని చెప్పే చిత్రమిది. ఈ చిత్రంతో నటుడిగా, వ్యక్తిగా ఎన్నో విషయాలు నేర్చుకునేలా చేసిన ప్రభుకి నా కృతజ్ఞతలు’’ అన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.