‘భీష్మ’ సెన్సార్‌ రివ్యూ

‘అఆ’ చిత్రంతో రూ.50కోట్ల మార్కెట్‌కు చేరుకున్న నితిన్‌.. ఆ తర్వాత వచ్చిన చిత్రాలతో దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తున్నప్పటికీ వరుస పరాజయాలు అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే కాస్త ఆలస్యమైనా ఓ చక్కటి వినోదాత్మక కథతో ‘భీష్మ’గా ముస్తాబై వస్తున్నారు. యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. రష్మిక కథానాయికగా నటించింది. మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకోని ఎలాంటి కట్స్‌ లేకుండా క్లీన్‌ యూ సర్టిఫికెట్‌ను అందుకొంది. చిత్రసీమ నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం సినిమాలో నితిన్‌ కామెడీ టైమింగ్‌.. రష్మికతో ఆయన కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచిందని తెలుస్తోంది. అంతేకాదు ఈ జోడీ డ్యాన్సుల్లోనూ అదరగొట్టినట్లు సమాచారం. దాదాపు 2గంటల 20నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూనే ఓ చక్కటి సందేశాన్ని అందివ్వబోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రీరిలీజ్‌ బిజినెస్‌ పరంగా విడుదలకు ముందే రూ.10కోట్ల లాభాన్ని అందుకున్నట్లు గుసుగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో బాక్సాఫీస్‌ వద్ద ‘భీష్మ’కు పోటీగా మరే చిత్రం లేకవడం దీనికి కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.