పోరాటం ముగించుకొచ్చిన ‘నారప్ప’

వెంకటేష్‌ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘నారప్ప’. తమిళ్‌లో విజయవంతమైన ‘అసురన్‌’ చిత్రాన్ని తెలుగు రీమేక్‌గా రూపొందుతోంది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రియమణి కథానాయిక. ఈ చిత్రం గత కొన్నాళ్లుగా తమిళనాడులో చిత్రీకరణ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షెడ్యూల్‌ పూర్తి చేసుకోని వెంకీ భాగ్యనగరానికి తిరిగొచ్చారు. దాదాపు నెలకు పైగా సాగిన ఈ సుదీర్ఘ షెడ్యూల్‌లో పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వంలో కీలకమైన పోరాట ఘట్టాలు చిత్రీకరించినట్లు సమాచారం. ఈ ఎపిసోడ్‌ను తమిళనాడులోని తిరిచందూర్‌ సమీపంలో ఉన్న తెరికాడుని రెడ్‌ డెసర్ట్‌ ప్రాంతంలో చిత్రీకరించారు. దాదాపు 12వేళ ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ప్రదేశంలో చిత్రీకరించిన ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందట. దీంతో పాటు అక్కడే మరికొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించడానికి మరికొంత సమయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.