డిస్కోరాజా’ హైలైట్‌ ఎపిసోడ్స్‌ ఇవేనట..

‘‘డిస్కోరాజా’.. రవితేజ అభిమానులకే కాదు, సినీప్రియులందరికీ కనులవిందును అందించే చిత్రమౌతుంది. ఆ పాత్ర మాస్‌రాజా కెరీర్‌లో టాప్‌-5 పాత్రల్లో ఒకటిగా నిలిచిపోతుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు దర్శకుడు వి.ఐ.ఆనంద్‌. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాల తర్వాత ఆయన నుంచి వస్తోన్న చిత్రమిది. ఓ సరికొత్త సైన్స్‌ఫిక్షన్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో మాస్‌రాజా రెండు విభిన్నమైన లుక్స్‌లో దర్శనమివ్వబోతున్నారు. జనవరి 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడుతూ దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు పంచకున్నారు ఆనంద్‌. ‘‘స్వతహాగా నాకు సైన్స్‌ ఫిక్షన్, సోసియో ఫాంటసీ కథలంటే చాలా ఇష్టం. పదేళ్ల క్రితం నా మదిలో మెదిలిన ఓ సైంటిఫిక్‌ ఆలోచన నుంచి ఈ కథ రాసుకున్నా. కానీ, ఇలాంటి కథాంశానికి కావల్సిన అన్ని వనరులు సమకూరడానికి ఇన్నేళ్ల సమయం పట్టింది. మధ్యలో నేనుకున్న పాయింట్‌కు తగ్గట్లుగా బయోకెమికల్‌ ల్యాబ్‌ ప్రయోగానికి సంబంధించి పేపర్‌లో వచ్చిన ఓ కథనం స్ఫూర్తితో ఈ కథను అల్లుకున్నా. నిజానికి ఈ తరహా పరిశోధనలు ప్రయోగ దశలోనే ఉన్నాయి. కానీ, నేనది ఫలిస్తే ఎలా ఉంటుంది అని ఊహించి ఫిక్షన్‌ కథాంశంగా దీన్ని రాసుకున్నా. ఇంతకీ ఆ ప్రయోగం ఏంటన్నది తెరపైనే చూడాలి. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు ఐస్‌ల్యాండ్‌లో చిత్రీకరించిన ఎపిసోడ్‌. తెరపై దాదాపు 15 నిమిషాల నిడివితో ఉంటుంది. ఆ పార్ట్‌ చిత్రీకరణ జరపడానికి మేం చాలా కష్టపడ్డాం. ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ చిత్రానికి పనిచేసిన హాలీవుడ్‌ నిపుణులతో లాన్‌కూర్‌ అనే ఐస్‌లాండ్‌లో ఈ షూట్‌ చేశాం. ప్రఖ్యాత నటుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ నటించిన హాలీవుడ్‌ చిత్రం ‘ఇంటర్‌స్టెల్లార్‌’ చిత్రీకరించిన ప్రాంతమిది. వాతావరణ మార్పుల వల్ల అక్కడ చిత్రీకరణ మేం అనుకున్న దానికన్నా చాలా కష్టమైంది. మేం ఉదయం వెü™్లటప్పుడు ఆ ప్రాంతంలో మంచు అంతా గడ్డకట్టుకోని ఉంటే.. గంటలు గడిచేకొద్దీ అది కరిగిపోయి మేం తిరిగి వచ్చేటప్పటికీ ఆ మార్గమంతా ప్రమాదకర పరిస్థితుల్లోకి మారిపోయేది. అందుకే అక్కడికి వెళ్లడానికి తిరిగి రావడానికి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకున్నాం. ఇక సినిమాలో గ్రాఫిక్స్‌కు మంచి ప్రాధాన్యత ఉంది. దాదాపు 20 నిమిషాల నిడివి ఉంటుంది. మేమనుకున్న బడ్జెట్‌లో ఇలాంటి సైన్స్‌ఫిక్షన్‌ కథాంశానికి తగ్గట్లుగా రిచ్‌ లుక్‌లో గ్రాఫిక్స్‌ చేయడం కాస్త కష్టంతో కూడుకున్న పనే. అందుకే విడుదల కాస్త ఆలస్యమైనా దీని కోసం బాగా కష్టపడ్డాం. తెరపై ఈ ఎపిసోడ్లను చూస్తున్నప్పుడు ఆ అనుభూతి ప్రేక్షకులకు అర్థమవుతుంది’’ అన్నారు ఆనంద్‌.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.