రౌడీ సోదరులు ఒకరివెంట ఒకరు

వి
జయ్‌ దేవరకొండ.. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో అగ్ర దర్శక, నిర్మాతలందరికీ మోస్ట్‌ వాంటెడ్‌ హీరో. గతేడాది ‘మహానటి’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్లు ఖాతాలో వేసుకున్న ఈ రౌడీ హీరో.. ఇప్పుడు ‘డియర్‌ కామ్రేడ్‌’గా అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. నూతన దర్శకుడు భరత్‌ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. జులై 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే దీనికన్నా మరో మూడు వారాల ముందే మరో దేవరకొండ వెండితెరపై సందడి చేయబోతున్నాడు. అతను ఎవరు? అని అయోమయ పడకండి.. విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ. ప్రస్తుతం ఆనంద్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. యష్‌ రంగినేని - మధుర శ్రీధర్‌ సంయుక్తంగా ‘దొరసాని’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హీరో రాజశేఖర్‌ రెండో తనయ శివాత్మిక ఈ చిత్రంతో కథానాయికగా తెరకు పరిచయం కాబోతుంది. తెలంగాణ నేపథ్యంతో ఓ పీరియాడికల్‌ ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జులై 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. అంటే ఒకే నెలలో మూడు వారాల వ్యవధిలో దేవరకొండ సోదరులిద్దరూ బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయబోతున్నారనమాట. మరి ఆనంద్‌ కూడా తన అన్నలా తొలి చిత్రంతోనే సత్తా చాటుతాడో లేదో చూడాలి.

* రౌడీ సోదరుడికి మరో ఛాన్స్‌..
వెనుక విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ ఇస్తున్న ధైర్యమో.. నటుడిగా ఆనంద్‌పై ఉన్న నమ్మకమో తెలియదు కానీ, రౌడీ సోదరుడు అప్పుడే మరో ఛాన్స్‌ కొట్టేశాడట. ‘దొరసాని’ని నిర్మిస్తున్న మధుర శ్రీధర్‌తోనే మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట ఆనంద్‌. ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ ఫేం.. పవన్‌ సాధినేని ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే ఈ ప్రాజెక్టు వివరాల్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.