ఒక సినిమా.. రెండు క్లైమాక్స్‌లు!!

ఈ ఏడాది ఆరంభంలోనే ‘ఎఫ్‌2’ చిత్రంతో సినీప్రియులకు వినోదాల వడ్డించి అదిరిపోయే హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు విక్టరీ వెంకటేష్‌. ఈ క్రేజీ మల్టీస్టారర్‌ కోసం మరో యువ హీరో వరుణ్‌ తేజ్‌తో కలిసి తెర పంచుకున్నారు వెంకీ. ఇప్పుడిదే తరహాలో ‘వెంకీమామ’ అనే మరో మల్టీస్టారర్‌తో సందడి చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో వెంకీ తన మేనల్లుడు, యువ హీరో నాగచైతన్యతో కలిసి అలరించబోతున్నారు. యువ దర్శకుడు కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) తెరకెక్కిస్తున్న చిత్రమిది. వాస్తవానికి ఈ దసరా కానుకగానే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నప్పటికీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే తాజాగా ఈ చిత్ర క్లైమాక్స్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ మూవీ కోసం రెండు క్లైమాక్స్‌లను సిద్ధం చేశాడట దర్శకుడు బాబీ. ఇందులో ఒకటి విషాదాంతపు ముగింపు కాగా.. మరొకటి సుఖాంతం. ఎందుకిలా ప్లాన్‌ చేశారంటే.. ఈ సినిమాలో వెంకటేష్‌ మిలటరీలో పని చేసిన వ్యక్తిగా దర్శనమివ్వబోతున్న సంగతి తెలిసిందే. సినిమా చివర్లో ఆయన పాత్రకు భావోద్వేగాలతో కూడిన ఓ బరువైన ముగింపును ఇచ్చారట. అయితే ఇలా ఓ యాంటీ క్లైమాక్స్‌ చిత్రంలో ఇది వరకెప్పుడూ వెంకటేష్‌ కనిపించింది లేదు. కాబట్టి ఆయన పాత్రకు అలా ముగింపు చెప్తే ఆయన అభిమానులు ఎలా ఆదరిస్తారాన్నది అనుమానం. అందుకే ఎందుకైనా మంచిదని వెంకీమామ పాత్రను చంపకుండా కథ సుఖాంతమయ్యేలా మరో క్లైమాక్స్‌ను డిజైన్‌ చేసి పెట్టుకున్నారట బాబీ. ముందైతే రెండు రకాల క్లైమాక్స్‌లను చిత్రీకరించేసి ఆఖర్లో నిర్మాత సురేష్‌బాబుతో కలిసి చర్చించి ఏది సరైనదనిపిస్తే దాన్ని తెరపై చూపిద్దామని ఫిక్స్‌ అయిపోయాడట బాబీ. నిజానికి ఇటీవల కాలంలో కథ, కథనాలు ఆకట్టుకునేలా ఉండాలే కానీ, కథానాయకుడు కడదాకా ఉంటాడా? ఉండడా? అన్నది పట్టించుకోవట్లేదు. దీనికి ఇటీవల వచ్చిన ‘జెర్సీ’నే ఉదాహరణ. ఆ సినిమా చివర్లో నాని పాత్ర మరణించడంతోనే అద్భుతమైన ముగింపును చూపిచినట్లయింది. ఇక త్వరలో రాబోతున్న చిరంజీవి ‘సైరా’లోనూ యాంటీ క్లైమాక్సే ఉండబోతున్నట్లు ట్రైలర్‌ను చూస్తుంటే తెలుస్తోంది. ఏదేమైనా రానున్న రోజుల్లో యాంటీ క్లైమాక్స్‌ ఓ ట్రెండ్‌గా మారినా ఆశ్చర్యపోవక్కర్లే.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.