‘ఛలో గీతా’ వీకెండ్‌ పార్టీ వస్తోంది
గణేశ్‌, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘గీతా..ఛలో’. ‘వీకెండ్‌ పార్టీ’ అనేది ఉపశీర్షిక. కన్నడ చిత్రం ‘చమక్‌’కి అనువాద రూపమిది. మామిడాల శ్రీనివాస్‌, దుగ్గివలస శ్రీనివాస్‌ తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు. దివాకర్‌ సమర్పిస్తున్నారు. ఈ నెల 3న చిత్రం విడుదలవుతున్న సందర్భంగా, మంగళవారం హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక జరిగింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘యువతరం వీకెండ్‌ పార్టీలు జరుపుకుంటుంది. వీటి వల్ల కలిగే లాభనష్టాల్ని తెలిపే వినోదాత్మక కథతో రూపొందిన చిత్రమిది. కన్నడ తరహాలోనే తెలుగులోనూ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘భావోద్వేగాలు, వినోదం మేళవించిన కథ ఇది. తెలుగు ప్రేక్షకులకి నచ్చుతుంది. వరుస విజయాలతో దూసుకెళుతున్న రష్మిక ఇందులో నటించడం కలిసొచ్చే విషయం. మంచి తేదీని చూసుకుని నిర్మాతలు విడుదల చేస్తున్నార’’న్నారు అతిథులు. ఈ కార్యక్రమంలో బెక్కెం వేణుగోపాల్‌, రామసత్య నారాయణ, బాలాజీ నాగలింగం, సురేష్‌ కొండేటి, సాయివెంకట్‌, సత్యారెడ్డి, శోభారాణి పాల్గొన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.