‘జెర్సీ’... ఇది కూడా బయోపిక్కేనా?

నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జెర్సీ’. ఇదో క్రికెటర్‌ కథ. జాతీయ జట్టులో స్థానం కోసం పోరాడి ఓడిపోయిన ఆటగాడి కథ. టీజర్‌లో ఈ కథ గురించి కుప్తంగా చెప్పేసింది చిత్రబృందం. ఇప్పుడు మరో ఆసక్తికరమైన సంగతి బయటకు వచ్చింది. ‘జెర్సీ’ కూడా ఓ రకంగా బయోపిక్కే అని తెలుస్తోంది. రమణ్‌లాంబా అనే ఓ క్రికెటర్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించార్ట. 4 టెస్టులు, 32 వన్డే మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు రమణ్‌లాంబా. ప్రతిభావంతుడైన క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ కాలం కలసి రాలేదు. వరుస వైఫల్యాలతో జట్టుకి దూరమయ్యాడు. తిరిగి జాతీయ జట్టులో స్థానం సంపాదించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. ఆఖరికి స్టేడియంలో క్రికెట్‌ మ్యాచ్‌ ఆడుతూ, బంతి బలంగా తాకడంతో కోమాలోకి వెళ్లి, మూడేళ్ల తరవాత మరణించాడు. ‘జెర్సీ’ కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుందట. రమణ్‌లాంబా కథని స్ఫూర్తిగా తీసుకుని, కొన్ని మార్పులూ చేర్పులూ చేసినట్టు సమాచారం. రమణ్‌లాంబా కుటుంబ సభ్యుల్ని కలిసి, వాళ్ల అనుమతి తీసుకున్న తరవాతే ఈ చిత్రాన్ని మొదలెట్టారట. మరి అతని కథకూ, ఈ సినిమాకీ ఇంకెన్ని పోలికలు ఉన్నాయో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.