చైతూని చంపేయబోతున్నాడట

విషాదాంతపు కథలు చిత్రసీమలో అరుదుగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా స్టార్‌ కథానాయకులతో ఈ తరహా సాహసాలు చేయించడానికి దర్శక నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోని నిర్ణయాలు తీసుకునేవారు. కానీ, గత కొన్నేళ్లుగా విషాదాంతపు కథలతోనే వరుస విజయాలు ఖాతాలో వేసుకుంటున్నారు స్టార్‌ సినీ తారలంతా. నాని.. ‘జెర్సీ’, కార్తికేయ.. ‘ఆర్‌ఎక్స్‌ 100’, కీర్తిసురేష్‌.. ‘మహానటి’, చిరంజీవి.. ‘సైరా’ వంటివన్నీ ఈ తరహా ప్రయత్నాలే. ఇప్పుడీ విషాద కథల జాబితాలోకి నాగచైతన్య చిత్రం కూడా వచ్చి చేరబోతుందట. ప్రస్తుతం ఆయన శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’ అనే చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. చైతూకి జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో చైతన్య తెలంగాణ ప్రాంత కుర్రాడిగా కనిపించబోతున్నాడు. ఇప్పుడీ చిత్ర క్లైమాక్స్‌ను విషాదాంతంగా ముగించబోతున్నాడట శేఖర్‌ కమ్ముల. అంటే చిత్ర ముగింపులో నాగచైతన్యను ఆయన చంపెయ్యబోతున్నారట. ఇదొక సరికొత్త ప్రేమకథతో రూపొందుతోందని, క్లైమాక్స్‌లో చైతూ మరణం సినీప్రియులను కదిలిస్తుందని, ఆయన మరణం తర్వాత సాయి పల్లవి అతని జ్ఞాపకాలు తలచుకుంటూ గడపడంతో సినిమా ముగించేలా క్లైమాక్స్‌ను ప్లాన్‌ చేసుకున్నారట శేఖర్‌. మరి ఈ వార్తల్లో నిజమెంత? చైతూ తొలిసారి చేస్తోన్న ఈ తరహా సాహసం ఆయనకెలాంటి ఫలితాన్ని అందివ్వనుంది? వంటివి తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.