ఫేమస్‌ లవర్‌కే ఆ తేదీని వదిలేశాడట

నా
గచైతన్య.. విజయ్‌ దేవరకొండ బాక్సాఫీస్‌ ముందు తలపడబోతున్నారని గత కొన్నాళ్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైతూ.. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ ప్రేమకథ చేస్తుండగా.. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ అనే చిత్రం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న రాబోతున్నట్లు నిన్నమొన్నటి వరకు గుసగుసలు వినిపించాయి. కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చైతూ ఆ తేదీని దేవరకొండకే వదిలేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆయన తన చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్‌ 2న ప్రేక్షకులకు చూపించబోతున్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందట. ‘ఫిదా’ వంటి హిట్‌ తర్వాత శేఖర్‌ నుంచి రాబోతున్న చిత్రం కావడం, చైతన్యకు జోడీగా తొలిసారి సాయిపల్లవి నటిస్తుండటం వంటి కారణాలతో ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరో విశేషమేంటంటే.. నాగచైతన్య ఈ సినిమా కోసం తొలిసారి తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారట. దీనికి ‘లవ్‌ స్టోరీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తోందట చిత్ర బృందం.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.