ప్రెస్‌మీట్‌ సెంటిమెంట్‌ మరోసారి పండుతుందా?

సెంటిమెంటో? ఏమో తెలియదు కానీ, మహేష్‌బాబు మరోసారి తనకు అచ్చొచ్చిన దారిలో నడవబోతున్నాడు. తన తాజా చిత్రం కోసం మరోసారి ప్రెస్‌మీట్‌ నిర్వహించేందుకు సిద్ధమయ్యాడట. ఏంటి తన కొత్త సినిమా గురించి ఏమైనా కీలకమైన విషయాలు చెప్పబోతున్నాడా? అని అనుకోకండి.. ఎందుకంటే ఆయన ప్రెస్‌మీట్‌ పెట్టబోతుంది ‘మహర్షి’ సినిమాలో. ‘భరత్‌ అను నేను’లో ప్రీక్లైమాక్స్‌కు ముందు.. ఓ విలేకర్ల సమావేశానికి సంబంధించిన సీన్‌ వస్తుంది. ఈ సన్నివేశంలో మీడియా మొత్తాన్ని ఏకిపారేస్తాడు మహేష్‌. థియేటర్లో ఆ సన్నివేశానికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. అందుకే ఇప్పుడిదే తరహాలో ‘మహర్షి’లోనూ ఓ ప్రెస్‌మీట్‌ సీన్‌ను ఏర్పాటు చేశారట దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈ సన్నివేశంలో రిషి రైతుల గురించి మాట్లాడుతూ అద్భుతమైన స్పీచ్‌ ఇవ్వబోతున్నాడట. అన్నదాతలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవల్సి వస్తోంది? వారి సమస్యలేంటి? ప్రభుత్వాలు, ప్రజలు వారి కోసం ఏం చేయాలి? వంటి అనేక అంశాలు ఆ స్పీచ్‌లో మాట్లాడతాడట. అత్యంత భావోద్వేగభరితంగా సాగే ఈ ప్రెస్‌మీట్‌ సీన్‌ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుందట. మరి చిత్ర బృందం నమ్మకాలు ఎంత మేర నిజమౌతాయో తెలియాలంటే మే 9 వరకు వేచి చూడాల్సిందే. అయితే ఇక్కడ ఓ విషయం గుర్తుచేసుకోవాలి. మహేష్‌ ప్రెస్‌మీట్‌ సీన్స్‌ అనగానే.. ‘బిజినెస్‌మ్యాన్‌’, ‘భరత్‌ అను నేను’ చిత్రాలే ఠక్కున గుర్తొస్తాయి. ఈ రెండూ బాక్సాఫీస్‌ ముందు బ్లాక్‌బస్టర్‌ విజయాలందుకున్నాయి. మరి ఈ సినిమాతో ఆ సెంటిమెంట్‌ మరోసారి కొనసాగుతుందేమో వేచి చూడాలి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.